బెయిల్ డీల్ కేసు విచారణ 13కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ కోసం ముడుపులు చెల్లించారంటూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో నిందితులు గురువారం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో హాజరయ్యారు. నిందితులంతా రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు నిందితుల్లో మాజీ న్యాయమూర్తులు తల్లూరి పట్టాభిరామారావు, తెలికపల్లి వెంకట చలపతిరావు, రామారావు కుమారుడు తల్లూరి రవిచంద్ర, మధ్యవర్తులుగా వ్యవహరించిన పొండూరి యాదగిరిరావు, తాడిశెట్టి ఆదిత్య ఉన్నారు. నిందితులకు చార్జిషీట్ ప్రతులను అందజేసిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
ఫోక్స్‌వ్యాగన్ కేసులోనూ...: ఫోక్స్‌వ్యాగన్ కార్ల తయారీ కంపెనీని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయిస్తామం టూ ముడుపులు తీసుకున్న వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసు నిందితులు భువన్‌కుమార్ చతుర్వేది, జోసెఫ్ జార్జ్ గురువారం ఎంఎస్‌జే కోర్టులో హాజరయ్యారు. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తు బాండ్లను సమర్పించాలన్న కోర్టు.. తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితులైన హెల్మత్ షూష్టర్, అశోక్‌కుమార్ జైన్, జగదీష్ అలగ్‌రాజా, గాయత్రీ చంద్రవదన్, వశిష్ట వాహన్ సంస్థకు సమన్లు అందకపోవడంతో.. అందజేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది.