baireddipalle
-
37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు!
సాక్షి, బైరెడ్డిపల్లె(చిత్తూరు జిల్లా): ఎవరినైనా ఒకసారో.. రెండుసార్లో పాము కాటేయడం సహజం.. అయితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(42)ను ఏకంగా 37 సార్లు కాటేయడం విచిత్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది. అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓ సారి కాటేస్తున్నాయి. 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం. ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని వాపోతున్నాడు. రెక్కాడితేగానీ డొక్కాడని సుబ్రమణ్యంను నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో శంకర్రాయలపేటలోని జేఎంజే ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన దీనావస్థను గుర్తించి దాతలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. (విషాదం: చిన్నారి నీటి తొట్టిలో పడి..) -
మూడు దశాబ్దాల తర్వాత ఒక్కటైన గ్రామస్తులు
సాక్షి, పలమనేరు/బైరెడ్డిపల్లి: ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత మూడు దశాబ్దాలుగా వర్గపోరు సాగుతూనే ఉంది. ఏటా గ్రామంలో జరిగే పండుగలు సైతం రెండు వర్గాలు వేర్వేరుగానే చేసుకునేవారు. ఈ రెండు వర్గాల మధ్య పోరు చాలాకాలం పాటు సాగింది. ఫలితంగా గ్రామంలో అనాదిగా సాగే మార్గసహేశ్వరస్వామి ఉత్సవాలు 32 ఏళ్లుగా జరగలేదు. అయితే గ్రామస్తులు, ఇరువర్గాల పెద్దమనుషులు, గ్రామ యువత ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కంకణం కట్టుకున్నారు. గత పదిరోజులుగా జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో గ్రామంలోని మార్గసహేశ్వురుని సాక్షిగా గ్రామం ఒక్కటైంది. సినిమాను తలపించేలా ఉన్న యదార్థ కథనం ఇది. బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఫలించిన ఇరువర్గాల పెద్దల కృషి అడవికి ఆనుకుని ఉండే నెల్లిపట్ల చాలా పాత గ్రామం. ఈ గ్రామానికి తమిళనాడు రాష్ట్రం దగ్గరగా ఉంటుంది. తెలుగు, తమిళ సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఆ మండలంలో ఇదే పెద్దపంచాయతీ. 1995లో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరి ఊరు రెండుగా చీలింది. అప్పటినుంచి ఎన్నికల సమయంలో, జాతరలప్పుడు గొడవలు జరుగుతుండేవి. గ్రామంలో జరిగే అన్ని పండుగలు రెండు దఫాలుగా రెండు వర్గాలు జరుపుకునేవి. గత 32 ఏళ్లుగా ఇరువర్గాల మధ్య జరిగిన సంఘర్షణలు, ఎన్నో ఇబ్బందులు వారిలో కొత్త ఆలోచనలకు దారితీశాయి. పాతతరం పెద్దలకు నేటి తరం యువత ఆలోచనలు కలిశాయి. గ్రామం బాగుపడాలంటే ప్రజలు సుఃఖసంతోషాలతో జీవించాలంటే గ్రామం ఒక్కటవ్వాలని భావించారు. దీంతో ఇరువర్గాలకు చెందిన పెద్దలు ఇంటికో మనిషిని రమ్మని ఇటీవల పంచాయతీ నిర్వహించారు. ఇకపై ఎటువంటి వర్గాలు లేకుండా కలిసిపోదామని మూ కుమ్మడిగా తీర్మానించారు. గ్రామ సమపంలోని పట్నపల్లి కల్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రమాణాలు చేసుకున్నారు. దీంతో గ్రామం ఒక్కటైంది. మార్గసహేశ్వరునికి సామూహిక పూజలు పౌర్ణమి సందర్భంగా బుధవారం గ్రామంలోని అందరూ కలసిపోయారు. ఊరంతా కలసి మహిళలు కలశాలతో గ్రామంలోని మార్గసహేశ్వరుని ఆలయంలో సామూహిక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆగిపోయిన ఉత్సవాలను ఇకపై ఏటా కొనసాగించనున్నట్టు పెద్దలు తెలిపారు. గ్రామస్తులంతా కలసి సహపంక్తి భోజనాలు చేశారు. -
వ్యక్తిని హత్య చేసి రూ. 6 లక్షలతో పరారీ
చిత్తూరు : వ్యాపారం కోసం ఇంట్లోని నగదును తీసుకుని వెళ్తున్న వ్యక్తిని ఆగంతకులు ఉరి వేసి హతమర్చి అతని వద్దనున్న రూ. 6 లక్షలతో ఉడాయించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం కమ్మనపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ... గ్రామానికి చెందిన వెంకటప్ప (68) గొర్రెల విక్రయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆ క్రమంలో ఈ రోజు తెల్లవారుజామునే ఇంట్లో నుంచి రూ. 6 లక్షలు తీసుకొని గొర్లను కొనుక్కొని రావడానికి గుంటూరు బయలుదేరాడు. అయితే గ్రామ శివారులోని గురుకుల పాఠశాల వద్దనున్న చెట్టుకు వెంకటప్ప ఉరేసుకొని వేళాడుతూ కనిపించడంతో.. స్థానికులు కుటుంబ సభ్యలకు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వెంకటప్ప మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని చిత్తూరు తరలించారు. కాగా.. నగదు కోసమే ఈ హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యలా కనిపించడం కోసం ఆగంతకులు వెంకట్టప్పకు ఉరేసి ఉంటారని పోలీసులు వద్ద ఆరోపించారు.