Bakarapeta
-
3 Burnt Alive: ఆ స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది
ఆశలు సజీవ దహనమయ్యాయి. కంటి దీపాలు కొడిగట్టాయి.. ఎదిగి వచ్చిన పిల్లలు ఇక లేరనే నిజాన్ని ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది.. ఆనవాళ్లు తప్ప కడచూపునకూ నోచుకోని దయనీయ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.. జీవితంలో బాగా స్థిరపడాలనే లక్ష్యాన్ని విధి కాలరాసినా.. ఆ స్నేహాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. – మార్కాపురం/భాకరాపేట చిత్తూరు జిల్లా భాకరపేట సమీపంలోని చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన రావూరి తేజ(29), సాకిరి బాలాజీ(21), పటాన్ ఇమ్రాన్ ఖాన్(23) ముగ్గురు స్నేహితులు. ఈ నెల 16న తమ స్నేహితుడైన నరేంద్ర కారును తీసుకుని తేజ గుంటూరు జిల్లా దాచేపల్లిలో టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ దగ్గరకు వచ్చాడు. అతడిని కారులో ఎక్కించుకుని కడపకు వెళ్లాడు. అక్కడికి మరో స్నేహితుడు తిరుపతికి చెందిన బాలాజీ చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి 17వ తేదీ ఉదయం కడప నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. అదేరోజు సాయంత్రం మార్కాపురం మండలం జంగంగుంట్ల–తిప్పాయపాలెం గ్రామాల మధ్య కారు టైరు పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. కారు పెట్రోల్ ట్యాంక్‌కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. డోర్లు తెరుచుకోకపోవడం, మంటలు ఎక్కువ కావడంతో కారులోనే ముగ్గురూ సజీవ దహనమయ్యారు. మృతదేహాల గుర్తింపు ఇలా.. కారులో ఉన్న ముగ్గురు సజీవ దహనం కావడం, సమాచారం లేకపోవడంతో కారు నంబర్ ఆధారంగా పోలీసులు కారు యజమానికి ఫోన్ చేశారు. ముందుగా డ్రైవింగ్ సీట్లో ఉన్న తేజ వివరాలు సేకరించారు. తిరుపతి జిల్లా బాకరాపేట వాసిగా గుర్తించి వారి కుటుంబ సభ్యుల సాయంతో మిగిలిన ఇద్దరి వివరాలు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు వచ్చి డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని తేజగా, పక్కనే చేతికి ఉన్న ఉంగరం ఆధారంగా ఇమ్రాన్‌ఖాన్, వెనుక సీటులో ఉన్న వ్యక్తిని బాలాజీగా గుర్తించారు. మృతదేహాలకు డీఎన్ఏ టెస్టు చేయనున్నట్లు రూరల్ ఎస్ఐ సుమన్ తెలిపారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. కాగా మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మార్కాపురం జిల్లా వైద్యశాల మార్మోగింది. చదవండి: (Hyderabad: స్టేజీపై నుంచి పడి ఇంటెలిజెన్స్ ఏడీ దుర్మరణం) భాకరాపేటలో విషాద ఛాయలు ముగ్గరు స్నేహితులు కారు ప్రమాదంలో సజీవ దహనమైన ఘటనతో భాకరాపేటలో విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రికే మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీగా మార్కాపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించే విషయంలో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది. ఆసుపత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మధ్యాహ్నం పైన పోస్టుమార్టం పూర్తి కాగా.. అర్ధరాత్రికి మృతదేహాలను భాకరపేటకు తరలించారు. రెండు వారాల్లో కువైట్ వెళ్లేవాడు ‘నా కుమారుడు తేజ కువైట్‌కు వెళ్లేందుకు పాస్‌పోర్టు, వీసా సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీశైలంతోపాటు కనకదుర్గమ్మను దర్శించుకుని కువైట్ వెళ్దామని భావించి స్నేహితులతో కలిసి కారులో బయలుదేరాడు. సాయంత్రం 5.30–6 గంటల మధ్య ఫోన్ ద్వారా సమాచారం అందడంతో నమ్మలేకపోయా. తనకు కుమార్తె హాసిని అంటే చాలా ప్రేమ, నిన్న కూడా మాట్లాడాడు. డాడీ లేడు అన్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థంకావడం లేదు’ అంటూ తల్లిదండ్రులు వసంత, భాస్కర్ బోరున విలపించారు. భాకరాపేటలోని బీసీ కాలనీలో తేజ కుటుంబం నివాసం ఉంటోంది. భాస్కర్ పెయింటర్‌గా పనిచేస్తూ కుమారుడిని బెంగళూరులో ఇంజినీరింగ్ చదివించారు. టూర్ అంటే పంపించేదాన్ని కాదు ‘నా కొడుకు బాలాజీ బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. వచ్చే నెలలో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నానని చెప్పాడే కానీ టూర్ అని చెప్పలేదు. అలా అయితే పంపెదాన్నే కాదు’ అంటూ తల్లి ఇందిర, తండ్రి సత్యనారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. టీటీడీ ఉద్యోగస్తులైన ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు బాలాజీ కాగా రెండో కుమారుడి పేరు కూడా బాలాజీనే. కుమారుడి మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగ రీత్యా తిరుపతిలో ఉంటున్నారు. ఇలా జరుగుతుందనుకోలేదు.. ‘నా కుమారుడు ఇమ్రాన్‌ఖాన్ డిప్లొమో చదివి గుంటూరు జిల్లా దాచేపల్లి టెలికం శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురూ మంచి స్నేహితులు. అర్ధంతరంగా చనిపోయారంటే నమ్మలేకపోతున్నాన’ని తండ్రి మస్తాన్‌ఖాన్ విలపిస్తూ చెప్పారు. ఒక్కడే కుమారుడు కావడంతో మరణ వార్తను తల్లి నజీరా, ఇద్దరు అక్కలు తట్టుకోలేకపోతున్నారు. భాకరాపేటలోని తలకోన రోడ్డులో ఇమ్రాన్ కుటుంబం నివాసం ఉంటోంది. -
భాకరాపేట ప్రమాద బాధితులను పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మృతి చెందడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు. రుయాతో పాటు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, రాత్రంతా అధికారులు స్పాట్లో ఉండి పర్యవేక్షించారని తెలిపారు. స్పాట్లో ఏడు మంది మృతి చెందారని, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు. ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ఫ్యాక్చర్లు అయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై సమీక్షించారని వెల్లడించారు. ఇప్పటికే మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారని గుర్తుచేశారు. మంచి చికిత్స అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. తక్షణం స్పందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. భాకరాపేట ఘాట్‌లో తక్షణం రైలింగ్ ఏర్పాటుకు ఆదేశిస్తాని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 1500 కోట్లతో అక్కడ నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. ఆ రోడ్డు నిర్మాణం సమయంలో పూర్తి స్థాయిలో పర్మనెంట్ రైలింగ్‌కు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాకరాపేట లోయలో పెళ్లి బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డ వారిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బస్సు బోల్తా ఘటనలో ఎనిమిది మంది మరణించగా 45 మంది క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆసుపత్రిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. -
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. క్షతగాత్రుల్ని తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. చదవండి: (చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు) -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు
చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్ హౌస్) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది. అయ్యా.. కాపాడండి.. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కలెక్టర్ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం అతివేగమే కారణం ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్ బంకులో బస్సుకు డీజిల్ పట్టించారు. ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. -
కోడలి ఆత్మహత్యతో మామ బలవన్మరణం
సాక్షి, భాకరాపేట: ఆ ఇంట మళ్లీ పెనువిషాదం అలుముకుంది. కోడలు అంత్యక్రియలు ముగిసిన పది గంటల వ్యవధిలోనే ఓ మామ తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారి పల్లెలో చోటుచేసుకుంది. భాకరాపేట ఎస్ఐ రవినాయక్ కథనం..బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆనందరెడ్డికి ఇదే గ్రామానికి చెందిన హరితతో 4 నెలల క్రితం వివాహమైంది. ఆమె అరగొండ అపోలో హాస్పిటల్లో నర్సింగ్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. (అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!) ఆనందరెడ్డి వేధింపులు తాళలేక గురువారం హరిత ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం విదితమే. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి కూడా. ఇదేరోజు పోస్టుమార్టం అనంతరం రాత్రి 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం తెల్లవారిజామున పొలం వద్దకు వెళ్లి వస్తానంటూ వెళ్లిన హరిత మామ రామిరెడ్డి (67) ఎంతసేపటికీ తిరిగి రాలేదు. (వరద నీటిలో తండ్రీకూతుళ్లు గల్లంతు) దీంతో అక్కడికి వెళ్లి చూడగా మామిడితోటలో చెట్టుకు డ్రిప్ పైపులతో ఉరేసుకుని విగతజీవిగా వేలాడుతున్న రామిరెడ్డిని గుర్తించారు. కోడలి మరణంతో అవమాన భారం తట్టుకోలేక అతడు బలవన్మరణం చెందినట్టు ఎస్ఐ చెప్పారు. పీలేరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ఇదేరోజు రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి అదృశ్యమైన ఆనందరెడ్డి జాడ లేకపోవడంతో రెండవ కొడుకు తలకొరివి పెట్టాడు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి నగరంలోని బాకరాపేట ఘాట్ వద్ద ఎర్రచందనాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన భారీ వాహనాన్ని అటవీశాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఆ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. దాదాపు 200 భారీ ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అటవీ శాఖ అధికారులను చూసి ఎర్రచందనం స్మగ్లర్లు కాళ్లకు బుద్ది చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉన్నారని, ఆ క్రమంలో తాము దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.