టీ–టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్
నిజాంపేట్, షాద్‌నగర్: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ తెలుగు దేశం పార్టీ(టీ–టీడీపీ) అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బక్కని నర్సింహులును పొలిట్‌బ్యూరోకి తీసుకోవడంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీగా, టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. టీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో స్వతంత్ర ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. 2007లో మన పార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పొత్తుపై కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మె ల్యే ఎన్నికల బరిలో నిలబడి 23,430 ఓట్లు సాధించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నర్సింహులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నుంచి బక్కని నర్సింహులు నియామక పత్రాన్ని అందుకున్నారు.