‘ఆరాధన’.. అరణ్యరోదన
వేములవాడ, న్యూస్‌లైన్: ఒకప్పుడు ఘంటసాల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జిక్కీ, జానకీ వంటి మహామహులు గానం చేసిన వేదిక అది.. నేడు పేరెన్నికగన్న ఒక్క కళాకారుడు లేని వైనం.. గాత్ర కచేరీలకు బదులు సినీ భక్తి గీతాలాపన చేసే దైన్యం.. ఇదీ ఏటా రాజన్న ఆలయంలో నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రహసనం. క్రమంగా వేడుకలు కళతప్పుతున్నాయి. అంతేకాకుండా ఆహ్వాన పత్రిక ముద్రణ విషయంలో నిర్లక్ష్యం. కార్యక్రమ తేదీలను తప్పుగా ముద్రించిన నిర్లిప్తత. ఆరు దశాబ్దాల క్రితం అంకురించిన ఈ ఉత్సవాలు కీర్తి ఏటా దిగజారుతుంది.
ఆరు దశాబ్దాల చరిత్ర..
ఈ సంవత్సరం 61వ త్యాగరాజ ఆరాధనోత్సవాలను ని ర్వహించేందుకు రాజన్న ఆలయ అధికారులు రంగం సి ద్ధం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మొదట బ్రాహ్మణుడైన చెవిటి సాంబమూర్తి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన తదనంతరం రాజన్న ఆలయం ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది. కాలక్రమేనా ఇక్కడికి వచ్చిన అధికారులు సైతం వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించారు. అంతే అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిం చారు.
అయితే ఏటా బడ్జెట్ పెరుగుతున్న ఉత్సవాల కీర్తి తగ్గుతుంది. ఇక ఆహ్వానపత్రికలోని రెండో పేజీలో ఉత్సవాల తేదీలను సైతం తప్పుగా ముద్రించారు. ఒకప్పటి తో పోలిస్తే ఆదాయం పదింతలు పెరిగింది. అయినా ని ర్వహణ మాత్రం అంతంతే. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఓ జూనియర్ అసిస్టెంట్ కేడర్ అధికారి తీసుకున్నారు.అయితే అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు, పాలకవర్గం దృష్టి పెట్టకపోవడం శోచనీయం. అయినవారికీ, బంధుప్రీతికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
రూ.4 లక్షలతో 45 కార్యక్రమాలు
ఈ సంవత్సరం సుమారు రూ. 4 లక్షలకు పైగా బడ్జెట్‌ను కేటాయించారు. కార్యక్రమాల విషయానికొస్తే 5 రోజుల పాటు 45 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆహ్వానపత్రిక సూచిస్తుంది, దురదృష్టమేమిటంటే ఈ ఐదు రోజుల్లో ఏనాడూ ఒక్క పేరెన్నికగన్న కళాకారుడి కార్యక్రమం లేకపోవడం. ఒకరిద్దరు కళాకారుల గాత్రకచేరీలు మినహా అంతా మమ అనిపించేలా తెలుస్తుంది. ఇక త్యాగరాజ కృతులు వినిపించాల్సిన వేదికపై సినీ భక్తిసంగీతం, హరికథ, బుర్రకథలకు ప్రాధాన్యతనిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం.