Bala Sadanam
-
బాల సదనంలో చిన్నారిపై లైంగిక దాడి
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో స్త్రీ శిశుసంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాల సదనంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి, మరో చిన్నారిపై లైంగిక దాడికి యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాల సదనానికి వెళ్లిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు బాధిత చిన్నారులు విషయాన్ని చెప్పడంతో వారు గురువారం కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన వెలుగులోకి రాకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాల సదనంలో పదేళ్ల వయసున్న చిన్నారులు చదువుకుంటున్నారు. వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలకు చెందిన ఎన్జీవోలు పిల్లల ఆలనాపాలనా చూడడంతో పాటు.. ఏ ప్రాంతంలోనైనా అనాథ బాలలు కనిపిస్తే తీసుకొచ్చి ఈ సదనంలో చేర్చుతారు. ఇదే తరహాలో 17వ తేదీన ‘లవ్ టూ సర్వే ఫౌండేషన్, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’కు చెందిన ప్రతినిధులు ఇద్దరు అనాథ చిన్నారులను సదనంలో చేర్చేందుకు వచ్చారు. అదే సమయంలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ వచ్చి 16వ తేదీ అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చి కత్తితో బెదిరించి అత్యాచారం చేశాడని, మరో చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చెయ్యిని గట్టిగా కొరకడంతో వదిలేసి పారిపోయాడని చెప్పారు. నిర్వాహకులకు చెప్పినా వారు పట్టించుకోలేదని విలపించారు. దీంతో నివ్వెరపోయిన ఎన్జీవో ప్రతినిధులు ఈ ఘటనపై బాల సదనం నిర్వాహకులను నిలదీయగా వారు ఎన్జీవో ప్రతినిధులపైనే చిర్రుబుర్రులాడారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తి పనే.. విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పద్మావతి బాల సదనానికి వచ్చి అప్పటికే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల జగ్గంపేట, కాకినాడ దమ్ములపేట తదితర ప్రాంతాల్లో చిన్నారులపై జరిగిన అత్యాచార కేసుల పరిశీలన నిమిత్తం వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబులు కూడా బాలసదనం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధిత చిన్నారితో తాము మాట్లాడామని ఇది తెలిసిన వ్యక్తి పనేనని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎ.నాగమురళి తెలిపారు. -
అనాథలకు అండగా హరీశ్ సతీమణి
సిద్దిపేటజోన్: ఆమె రాష్ట్ర రాజకీయాల్లో పేరున్న మాజీ మంత్రి హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనిత. సిద్దిపేట తన కుటుంబమని ప్రతి సమావేశంలో ప్రజలతో తన ప్రేమను, ఆప్యాయతను పంచుకుంటారు హరీశ్‌రావు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఆమె కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తుంటారు. అలాంటి శ్రీనిత శుక్రవారం రోజంతా సిద్దిపేటలోని ఒక బాలసదనంలో అనాథ పిల్లలతో గడిపారు. వారితో పాటు సహపంక్తి భోజనం చేసి హరీశ్‌రావు కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏటా సిద్దిపేటలోని వసతి గృహ విద్యార్థులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేసే ఆనవాయితీని శ్రీనిత ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే శుక్రవారం పట్టణంలోని అనాథ పిల్లల వసతి గృహం బాలసదనాన్ని సందర్శించి పిల్లల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకు ముందు వసతి గృహ నిబంధనలకు అనుగుణంగా భోజనానికి ముందు ఆమె చిన్నారులతో కలిసి భోజన మంత్రం చదివారు. అనంతరం జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారిణి జరీనాభేగంతో కలిసి వసతి గృహ విద్యార్థుల స్థితిగతులు తెలుసుకున్నారు. తన సొంత ఖర్చులతో అనాథ పిల్లలకు దుస్తులు, దుప్పట్లు, స్వెట్టర్లు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లలకు సేవ చేయడం కంటే గొప్ప ఆనందం ఏముందని.. విధి వక్రించి తల్లిదండ్రులకు దూరమైన పిల్లలకు సేవ చేయడం మాధవసేవతో సమానమని పేర్కొన్నారు. బాలసదనంలోని పిల్లలను చూసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, ఈ రోజు వారితో కొద్దిసేపు ప్రేమగా ఉండటం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల్లో చదువుపై తపన ఉందని, వారి చదువుకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె వెంట సిద్దిపేట, జనగామ జిల్లాల మహిళ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ బూర విజయ తదితరులు ఉన్నారు. భోజన మంత్రాన్ని పిల్లలతోకలిసి పఠిస్తున్న తన్నీరు శ్రీనిత -
కేజీబీవీల్లోకి బాలసదనం విద్యార్థులు
అనంతపురం టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలసదనాల్లోని విద్యార్థులను కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చేర్పించాలని ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ ఉషాఫణికర్ సూచించారు. అనంతపురం, ధర్మవరం, హిందూపురంలోని బాలసదనం సూపరింటెండెంట్లు రాధిక, సరస్వతి, రహమత్‌బీతో బుధవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను వివరించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను సమీపంలోని కేజీబీవీల్లోచేర్పించాలన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులను పూర్తి స్థాయిలో చేర్పించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలన్నారు. బాలసదనాల్లో అందించే సేవలను జేయాలన్నారు. అనాథలు, అవ్వతాత ఉండి ఆలనాపాలనా చూసుకోవడం ఇబ్బందిగా ఉన్న పిల్లలను గుర్తించాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పోషించలేక.. విక్రయానికి
బాలుడిని బాల సదనం చేర్చిన అధికారులు ఇందూరు : పేదరికం కారణంగా ఓ తండ్రికి కుమారుడు భారమయ్యాడు. అతడిని పోషించే మార్గం కానరాక.. విక్రయానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని బాలసదనానికి చే ర్చారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కసాబ్‌గల్లీకి చెందిన రాజుకు చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు రెండేళ్ల కుమారుడితో పాటు మతి స్థిమితం లేని భార్య ఉంది. పేదరికం కారణంగా కుమారుడిని ఎలా పోషించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాడు. ఆరోగ్యం, ఆర్థి క పరిస్థితి సహకరించకపోవడం తో బాలుడిని అమ్మాలని నిర్ణయిం చుకున్నాడు. కాలూరు రోడ్డు శివారులో నివసించేవారికి విషయం తెలిపాడు. వారు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ విభాగం సిబ్బంది జ మ్రు, బాబు, గంగామోహన్, నిజామాబాద్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తండ్రితో పాటు బాలుడిని సుభాష్‌నగర్‌లోని బాల సదనానికి తరలించారు. రాజుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తన భార్యకు మతి స్థిమితంలేదని, కుమారుని తరచూ కొడుతుందని అతడు పేర్కొన్నాడు. కుమారుడిని పో షించే శక్తి లేకపోవడంతో అమ్మాల నుకున్నానని, ఎవరైనా దత్తత అడిగినా ఇవ్వాలనుకున్నానని తెలిపాడు. ఇతరులకు అప్పగిస్తే వారైనా బాగా చూసుకుంటారని భావించానంటూ కన్నీరుపెట్టాడు. తన కుమారుడిని పెంచి, మంచి భవిష్యత్ ఇవ్వాలని అధికారులను కోరాడు.