బాలసదనంలో అనాథ పిల్లలతో హరీశ్‌రావు సతీమణి శ్రీనిత గ్రూప్ ఫొటో
సిద్దిపేటజోన్: ఆమె రాష్ట్ర రాజకీయాల్లో పేరున్న మాజీ మంత్రి హరీశ్‌రావు సతీమణి తన్నీరు శ్రీనిత. సిద్దిపేట తన కుటుంబమని ప్రతి సమావేశంలో ప్రజలతో తన ప్రేమను, ఆప్యాయతను పంచుకుంటారు హరీశ్‌రావు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఆమె కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తుంటారు. అలాంటి శ్రీనిత శుక్రవారం రోజంతా సిద్దిపేటలోని ఒక బాలసదనంలో అనాథ పిల్లలతో గడిపారు. వారితో పాటు సహపంక్తి భోజనం చేసి హరీశ్‌రావు కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏటా సిద్దిపేటలోని వసతి గృహ విద్యార్థులకు చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేసే ఆనవాయితీని శ్రీనిత ఈ ఏడాది కూడా కొనసాగించారు.
ఈ క్రమంలోనే శుక్రవారం పట్టణంలోని అనాథ పిల్లల వసతి గృహం బాలసదనాన్ని సందర్శించి పిల్లల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకు ముందు వసతి గృహ నిబంధనలకు అనుగుణంగా భోజనానికి ముందు ఆమె చిన్నారులతో కలిసి భోజన మంత్రం చదివారు. అనంతరం జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారిణి జరీనాభేగంతో కలిసి వసతి గృహ విద్యార్థుల స్థితిగతులు తెలుసుకున్నారు. తన సొంత ఖర్చులతో అనాథ పిల్లలకు దుస్తులు, దుప్పట్లు, స్వెట్టర్‌లు, పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథ పిల్లలకు సేవ చేయడం కంటే గొప్ప ఆనందం ఏముందని.. విధి వక్రించి తల్లిదండ్రులకు దూరమైన పిల్లలకు సేవ చేయడం మాధవసేవతో సమానమని పేర్కొన్నారు. బాలసదనంలోని పిల్లలను చూసినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని, ఈ రోజు వారితో కొద్దిసేపు ప్రేమగా ఉండటం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల్లో చదువుపై తపన ఉందని, వారి చదువుకు తన కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆమె వెంట సిద్దిపేట, జనగామ జిల్లాల మహిళ శిశు సంక్షేమ శాఖ కోఆర్డినేటర్ బూర విజయ తదితరులు ఉన్నారు.
భోజన మంత్రాన్ని పిల్లలతోకలిసి పఠిస్తున్న తన్నీరు శ్రీనిత
Comments
Please login to add a commentAdd a comment