హైదరాబాద్‌లో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మరో డ్రగ్ రాకెట్ బట్టబయలయింది. భారీ స్థాయిలో మత్తు పదార్ధాలను అధికారులు కొనుగొన్నారు. జీడిమెట్ల ప్రాంతంలో ఉన్న బాలాజీ ల్యాబ్‌పై సైబారాబాద్ ఎస్ఓటీ, ఎన్సీబీ అధికారులు దాడులు చేసి 11 కిలోల కెటామైన్ స్వాధీనం చేస్తున్నారు. దీని విలువ రూ. 2 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో సంబంధమున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు పట్టుబడడంతో సంచలనం రేగింది. దీని వెనుక అంతర్జాతీయ ముఠా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి ఎక్కడికైనా ఎగుమతి అయిందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో పలువురు సినిమా నటులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు.