తెలంగాణకూ కావాలి ఓ సైనిక స్కూలు!
సందర్భం
భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం అభ్యంతరపెడితే సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు సైనిక స్కూళ్లలో 67 శాతం సీట్లు 13 జిల్లాల విద్యార్థులకే చెందే అవకాశం ఉంది. కే్రందం, తెలంగాణ సర్కారు జోక్యం చేసుకుంటే తప్ప తెలంగాణ విద్యార్థులకు ఈ రెండు సైనిక స్కూళ్లలో సీట్లు దొరకడం కష్టమవుతుంది.
దేశానికి క్రమశిక్షణ కలి గిన పౌరులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన సైనిక స్కూళ్లు ఆ లక్ష్యం దిశగా వెళుతున్నాయి. రక్షణ రం గంలో ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాల ఎంపికకు మం చి వేదికగా ఉపయోగపడు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో సైనిక స్కూలు ఏర్పాట యింది. దీనిని సెప్టెంబర్ 10, 1961న లాంఛ నంగా ప్రారంభించినా; 1962 జనవరి 18న అధికారికంగా కార్యక్రమాలు మొదలుపెట్టిం ది. ఆంధ్రప్రదేశ్ విభజనకు కొద్దిగా ముందు అక్కడ ఒక సైనిక స్కూలు ఉండగానే, చిత్తూరు జిల్లా కలికిరిలో మరో సైనిక స్కూలు ఏర్పాటు చేయడానికి అనుమతి లభించింది. అప్పటి ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన సొంత ఊరి మీద ప్రేమతో దీన్ని ఏర్పాటు చేయించారు. దేశంలో దాదాపు ప్రతి రాష్ట్రానికి ఓ సైనిక పాఠశాల ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు రెండు చొప్పున సైనిక స్కూళ్లు ఉన్నాయి. కర్ణాటకలో బీజాపూర్, కొడగు జిల్లాల్లో ఇవి ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో 25 సైనిక స్కూళ్లు ఉన్నా యి. మరో రెండు త్వరలో ఏర్పాటు కాబోతున్నా యి. సైన్యంలో ప్రాంతీయ, వర్గ అసమానతలను రూపుమాపేందుకు 1961లో నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి రక్షణ మంత్రి వీకే కృష్ణమీనన్ వీటికి అంకురార్పణ చేశారు. మౌలి కంగా విద్యార్థులను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యేలా తయారు చేయడమనే లక్ష్యంతో ఇవి ఏర్పాటయ్యాయి. యువ విద్యార్థుల్లో శారీర కంగా, మానసికంగా, ఉన్నత గుణశీలాలు పెం పొందించి దేశానికి ఉత్తమ పౌరులను అందించడం కూడా వీటి ల క్ష్యాలలో ఒకటి. పబ్లిక్ స్కూళ్ల మాదిరి గానే ఇవి ఆశ్రమ పాఠశాలలు. రెసిడెన్షియల్ విధా నంతో చక్కటి వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతుంది. 12వ తరగతి వరకు తప్పనిసరిగా ఎన్సీసీ శిక్షణ ఇస్తారు.
ఒక్కో సైనిక స్కూలులో అన్ని తరగతులు - ఆరు నుంచి 12 వరకు కలిపి 525 మంది విద్యార్థు లకు బోధన సౌకర్యం ఉంటుంది. కొన్ని పాఠశా లల్లో కొన్ని సీట్లు ఎక్కువ, కొన్నింటిలో తక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దేశంలోని సైనిక స్కూళ్లు త్రివిధ దళాలకు 7,000 మంది అధికారులను అందించాయి. పాఠశాలకు అవసరమైన భూమి, భవనాలు వంటి మౌలిక వస తులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుం ది. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థి వేతనాలను అంది స్తాయి. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దడం సైనిక స్కూళ్ల ప్రత్యేకత. దీనికితోడు సీబీఎస్ఈ సిలబస్ ద్వారా, ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే అవకాశం లభి స్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడాపోటీలు, ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల పరేడ్‌లో పాల్గొనే అవ కాశం కలుగుతుంది. సాహసకృత్యాలలో కూడా మంచి తర్ఫీదు ఇస్తారు. వీటిలో అరవయ్యో దశ కంలో చదువుకున్న విద్యార్థుల్లో కొందరు ‘జనరల్’ స్థాయికి, అదేవిధంగా వాయుసేనలో ‘ఎయిర్ చీఫ్ మార్షల్’, నౌకాదశంలో ‘అడ్మిరల్’ వంటి పదవు లను పొందారు. ఈ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో ప్రతిఏటా 130 నుంచి 160 మంది దాకా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యేటట్లు తర్ఫీదు ఇవ్వడం వీటి ప్రత్యేకత.
రాష్ర్ట విభజన జరిగిన తరువాత తెలం గాణ రాష్ట్రానికి కూడా అత్యవసరంగా ఓ సైనిక స్కూలును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రానికి ఓ సైనిక స్కూలు ఉన్నట్లే ఈ రాష్ట్రంలోనూ ఉండటం న్యాయం. ప్రస్తుతం 2015-16 సంవత్సరానికి ప్రవేశాల కోసం ప్రకటన వెలువడింది. దీనిలో కోరు కొండలో ఆరో తరగతిలో ప్రవేశానికి 90 సీట్లు, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 25 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు జిల్లా కలికిరి లో ఆరో తరగతిలో ప్రవేశానికి 105 సీట్లు ఉన్నాయి. వీటన్నిటికి ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అయితే సైనిక స్కూలు ఉన్న రాష్ట్రంలోని విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయిస్తారు. దీనివల్ల ఆయా రాష్ట్రా ల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది.
ప్రస్తుతానికి (2015-16 విద్యా సంవత్సరా నికి) ఈ విషయంలో పాత పద్ధతే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కలిపి ఇవ్వనున్నారు) అవలంబిస్తున్నారు. భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం అభ్యంతరపెడితే సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు సైనిక స్కూళ్లలో 67 శాతం సీట్లు 13 జిల్లాల విద్యార్థులకే చెందే అవకాశం ఉంది. కేంద్రం, తెలంగాణ సర్కా రు జోక్యం చేసుకుంటే తప్ప తెలంగాణ విద్యార్థు లకు ఈ రెండు సైనిక స్కూళ్లలో సీట్లు దొరకడం కష్టమవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రంలో సైనిక స్కూలు ఏర్పాటైతే 67 శాతం సీట్లు ఈ ప్రాంత విద్యార్థులే పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే జాతీయ విధానం ప్రకారం చాలా స్వల్ప సంఖ్యలోనే సీట్లను పొందాలి. రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ సైనిక స్కూలును రక్షణ శాఖ ఏర్పాటు చేసేలా కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకో వాలి. దీనికి తగిన ప్రణాళికను కేంద్రానికి సమ ర్పిస్తే మరో మూడు నాలుగేళ్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. కేంద్రం సైనిక స్కూలు మంజూరు చేయడానికి బలమైన కారణాలు ఉం డనే ఉన్నాయి. కావాల్సిందల్లా తెలంగాణ సర్కారు కార్యాచరణ, చొరవ మాత్రమే.
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు)