భార్యను కాపురానికి పంపలేదని..
ఓ అల్లుడు మద్యం మత్తులో ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్యను కాపురానికి పంపలేదని మామను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని ఏల్చూరులో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. స్థానిక కొండ కింద బజారుకు చెందిన జూటూరి పిచ్చయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
కుమార్తెలిద్దరినీ గ్రామంలోని సమీప బంధువైన పోలెబొయిన బాలకోటయ్య ఇద్దరు కుమారులకిచ్చి వివాహం చేశాడు. పిచ్చయ్య పెద్ద కుమార్తె పెద యోగేశ్వరమ్మను బాలకోటయ్య పెద్ద కుమారుడు కోటేశ్వరరావుకు, చిన్న కుమార్తె చినయోగేశ్వరమ్మను బాలకోటయ్య చిన్న కుమారుడు హనుమంతురావుకిచ్చి వివాహాలు చేశాడు. చినయోగేశ్వరమ్మ హనుమంతురావుల వివాహమై పదేళ్లయింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మద్యం వ్యసనానికి బానిసైన హనుమంతురావు రోజూ భార్యతో గొడవ పడుతుండే వా డు.
అన్నదమ్ములది వేర్వేరు కాపురాలు కావడంతో హనుమంతురావు ఇంటి గొడవలు అన్న కోటేశ్వరరావు అంతగా పట్టించుకునే వాడుకాదు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం హనుమంతురావు పీకలదాకా మద్యం తాగి వచ్చి భార్య చిన యోగేశ్వరమ్మను కొట్టాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన భార్యను కాపురానికి పంపడంలేదని శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంతో హనుమంతురావు అత్తగారింటికి వెళ్లి బూతుపురాణం అందుకున్నాడు. స్థానికులు సర్దిచెప్పి పంపారు. మళ్లీ అందరూ నిద్రిస్తున్న సమయంలో కోడిమాంసం కోసుకునే కత్తితో మరోసారి పిచ్చియ్య ఇంటికి వెళ్లి తలుపులు తన్నాడు.
మామను నిద్రలేపి తన భార్యను వెంటనే కాపురానికి పంపాలని హనుమంతురావు కేకలేశాడు. తలుపులు తీసుకుని బయటకు వచ్చిన పిచ్చయ్యపై కత్తితో తీవ్రంగా గాయపరచడంతో కుప్పకూలి అక్కడికక్కడే కన్నుమూశాడు. స్థానికులు నిద్రలేచి వచ్చే సరికి హనుమంతురావు కాళ్లకు బుద్ధి చెప్పాడు. పిచ్చియ్య కుమారుడు యోగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం పిచ్చయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎ.శివనాగరాజు తెలిపారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
దర్శి డీఏస్పీ లక్ష్మీనారాయణ, అద్దంకి సీఐ రమణకుమార్ ఆదివారం ఉదయం ఏల్చూరు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీ లించారు. మృతుడు పిచ్చయ్య కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.