ఇక్కడి సంస్థకు.. అక్కడి అధికారి!
హైదరాబాద్: పునర్విభజన చట్టానికి భిన్నంగా నాచారంలోని ఏపీ ఫుడ్స్ వ్యవహారం సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు బాలామృతం పేరిట పౌష్టికాహారాన్ని ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. విభజన చట్టంలోని 9వ షెడ్యూలులో ఏపీ ఫుడ్స్‌ను చేర్చారు. చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే అది ఆ రాష్ట్రానికే చెందుతుంది.
ఏపీ ఫుడ్స్‌కు మరెక్కడా యూనిట్లు లేనందున ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. కానీ, ఈ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారిని నియమించలేదు. ఐఏఎస్ అధికారుల కొరతకారణంగా ఈవైపు దృష్టి సారించలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎండీగా ఉన్న విజయ్‌మోహన్ కర్నూలు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
దీంతో ఈ విషయాన్ని సంస్థ కార్మికసంఘం అధ్యక్షుడు కూడా అయిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి కార్మికనేతలు వివరించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి.. తెలంగాణ ప్రభుత్వ అధికారిని నియమిం చేలా చూస్తానని నాయిని హామీ ఇచ్చినా ఫలితం లేదు. ఎండీ బదిలీ కాగానే ఏపీ మహిళా శిశుసంక్షేమశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న బాలమాయదేవిని ఇన్చార్జ్ ఎండీగా నియమించారు.