క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో ఆదా ఇలా చేయండి!
మీ క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించలేకపోతున్నారా? అయితే, మీ క్రిడిట్ కార్డు బిల్లును తక్కువ రేటుకే మరో కార్డుకు(బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్) మార్చుకోవచ్చు. ఇది కార్డులు జారీ చేసే బ్యాంకులు వినియోగదారులకు చెప్పే మాట. మీకు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అంటే ఏంటో సరిగ్గా తెలుసా?. ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల భారమయ్యే వడ్డీ రేట్లకు ప్రత్యామ్నాయంగా బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ను తెచ్చారు.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఒక క్రెడిట్ కార్డులోని క్రెడిట్ బ్యాలెన్స్ ను మరో క్రెడిట్ కార్డుకు పంపుకోవచ్చు. క్రెడిట్ కార్డులు మంజూరు చేసే బ్యాంకులు సంవత్సారానికి 40శాతానికి పైగా వడ్డీ రేట్లను చార్జ్ చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఒక అనువైన మార్గం. క్రెడిట్ కార్డును తీసుకున్న కొద్దికాలం(సాధారణంగా ఆరు నెలలు)పాటు బ్యాంకులు వినియోగదారుడి నుంచి ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. తీసుకున్న మొత్తాన్ని ఇచ్చిన సమయంలో చెల్లించలేకపోతే సదరు డబ్బుపై బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి.
ఎలా పనిచేస్తుంది
బ్యాలెన్స ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డుకు మాత్రమే చెల్లుబాటయ్యేలా బ్యాంకు ఓ చెక్కును విడుదల చేస్తుంది. చెక్ ను ఉపయోగించి క్రెడిట్ బిల్లును సదరు వినియోగదారుడు చెల్లించుకోవచ్చు.
ఎలా నిర్ణయించుకోవాలి
బ్యాలెన్స్ ను ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వల్ల ఎంత వడ్డీ అవుతుందో వినియోగదారుడు ముందుగా తెలుసుకోవాలి. తక్కువ వడ్డీ ఉన్న ఆప్షన్స్ ను ఎంచుకోవాలి. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ పై అందుతున్న రివార్డుల వివరాలను కూడా తెలుసుకోవాలి. వీటన్నింటితో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అనంతరం చెల్లింపుల గురించి ముందే లెక్కలు వేసుకుంటే మంచిది.