Bald Eagle
-
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్
వాషింగ్టన్: అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగ (బాల్డ్ ఈగల్)ను అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచీ యూఎస్ గ్రేట్ సీల్‌పై, డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైనా ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు. తర్వాత అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు జరిగాయి. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధుమ రంగు శరీరంతో కూడిన బాల్డ్ ఈగల్‌ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్ డిసెంబర్ 16న సెనెట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. దాన్ని సభ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బైడెన్ ఆమోదముద్రతో 240 ఏళ్ల తరవాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా దక్కింది. తొలిసారి రాగి సెంటుపై బాల్డ్ ఈగల్ ఉత్తర అమెరికాకు చెందిన పక్షి. మొట్టమొదట 1776లో మసాచుసెట్స్ రాగి సెంటుపై ఇది అమెరికా చిహ్నంగా కనిపించింది. తర్వాత వెండి డాలర్, హాఫ్ డాలర్, క్వార్టర్ తదితర యూఎస్ నాణేల వెనుక భాగంలో చోటుచేసుకుంది. బంగారు నాణేలకు ఈగల్, హాఫ్ ఈగల్, క్వార్టర్ ఈగల్, డబుల్ ఈగల్ అని నామకరణమూ చేశారు. 1940 జాతీయ చిహ్న చట్టం కింద బాల్డ్ ఈగల్ రక్షిత పక్షి. దాన్ని క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం. ‘‘బాల్డ్ ఈగల్‌ను 250 ఏళ్లుగా జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తూ వస్తున్నాం. దాన్నిప్పుడు అధికారికంగా ప్రకటించుకున్నాం’’అని నేషనల్ ఈగల్ సెంటర్ నేషనల్ బర్డ్ ఇనిషియేటివ్ కో చైర్మన్ జాక్ డేవిస్ ఒక ప్రటకనలో తెలిపారు. ఈ అర్హత మరే పక్షికీ లేదన్నారు. -
ఏమిటీ వింత..గద్ద పొదగని గుడ్డు .. అనాథ పిల్లకు తండ్రి కూడా!
మనుషులే కాదు.. ఒక్కోసారి మూగజీవాల ప్రవర్తన కూడా విపరీతమైన చర్చకు దారి తీస్తుంటుంది. మనిషికి మించిన మానవత్వం, ప్రేమను కనబర్చినప్పుడు అది తప్పకుండా ఆకట్టుకుంటుంది కూడా. అలా అమెరికా దృష్టిని ఆకట్టుకున్న ఓ గద్ద.. నెల తిరగకుండానే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొదటిసారి పొదగని ఓ గుడ్డుతో.. ఇప్పుడు ఓ అనాథ పిల్లతో.. మర్ఫీ.. మిస్సోరి వ్యాలీ పార్క్‌లో ఉంటున్న ఓ బాల్డ్ ఈగల్. వయసు సుమారుగా 31 ఏళ్లు ఉంటుంది. రెక్కకు గాయం కావడంతో ఎగరలేని స్థితి దానిది పాపం. మార్చి చివర్లో.. ఈ పక్షి ప్రవర్తన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం.. ఈ మగ పక్షి ఓ రాయిని పొదగడానికి ప్రయత్నించడం. గుడ్డు ఆకారంలోని ఆ రాయిని తనకింద ఉంచుకోవడం మాత్రమే కాదు.. దాని దగ్గరికి వచ్చిన తోటి గద్దలను తరిమి తరిమి కొట్టాడు మర్ఫీ. అలా మొదటిసారి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో దాని ప్రవర్తన పక్షులపై అధ్యయనం చేసే వాళ్లను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఇప్పుడు రెండోసారి.. మళ్లీ అది మీడియా సెన్సేషన్ అయ్యింది. ఈసారి ఓ నిజం పక్షికి తండ్రిగా మారింది మర్ఫీ. అక్కడికి అరవై మైళ్ల దూరం నుంచి కొట్టుకొచ్చిన ఓ పక్షి గూడులోని పిల్లను జాగ్రత్తగా చూసుకుంటోంది ఈ మగ గద్ద. ఆహారం అందించడం మాత్రమే కాదు.. ఎప్పుడూ వెంట ఉంటూ తోటి గద్దల నుంచి దానిని సంరక్షిస్తోంది. అయితే ఈ క్రమంలో తన ‘రాకీబేబీ’ని మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదండోయ్. ఒకవైపు ఆ రాయిని.. మరోవైపు అనాథ పక్షిని ఇద్దరి సంరక్షణను చూసుకుంటూ తన మంచి గుణం చాటుకుంటోంది మర్ఫీ. ఇదేం విచిత్రమో మరి.. ! -
ఈకలున్నా ఇది బాల్డ్ ఈగలే..!
ప్లే టైమ్ మనిషి కన్నా నాలుగురెట్ల తీక్షణమైన చూపు, నీటిలో ఈదుతున్న చేపను సైతం పట్టేసుకొని వెళ్లేంత నేర్పు బాల్డ్ ఈగల్‌కు సొంతం. ఉత్తర అమెరికా ఖండంలో మాత్రమే కనిపించే పక్షి ఇది. సరస్సుల, జలపాతాల సమీపాల్లో ఆవాసాన్ని ఏర్పరుచుకొని నీటికి పైవైపుకు వచ్చే చేపలను పట్టేసుకొని తింటూ ఉంటుంది. గూళ్ల నిర్మాణం విషయంలో ఉత్తర అమెరికా పరిధిలో ఉండే పక్షి, జంతు జాతుల్లో బాల్డ్ ఈగల్‌కు సాటివచ్చేవి మరేవీ లేవు. అన్ని పక్షి, జంతుజాతుల కన్నా పెద్దసైజు గూళ్లను కట్టుకొంటుంది. ఈ జాతిలో పరిమాణం విషయంలో మగపక్షుల కన్నా ఆడ పక్షులే పెద్దగా ఉండటం విశేషం. యునెటైడ్ స్టేట్ ఆఫ్ అమెరికా పరిధిలో ఈ పక్షులు విస్తృతంగా ఉంటాయి. అందుకే దీన్ని అమెరికన్లు తమ జాతీయ పక్షిగా గౌరవిస్తున్నారు, తమ జాతీయ చిహ్నంలో కూడా స్థానమిచ్చారు. జీవనక్రమంలో ఈకలేమీ ఊడిపోకపోయినా దీన్ని ‘బాల్డ్ ఈగల్’గానే వ్యవహరిస్తారు. ఖతార్ దేశ నాణేలపై కూడా ఈ పక్షి ఉంటుంది.