ఈకలున్నా ఇది బాల్డ్ ఈగలే..!
ప్లే టైమ్
మనిషి కన్నా నాలుగురెట్ల తీక్షణమైన చూపు, నీటిలో ఈదుతున్న చేపను సైతం పట్టేసుకొని వెళ్లేంత నేర్పు బాల్డ్ ఈగల్‌కు సొంతం. ఉత్తర అమెరికా ఖండంలో మాత్రమే కనిపించే పక్షి ఇది. సరస్సుల, జలపాతాల సమీపాల్లో ఆవాసాన్ని ఏర్పరుచుకొని నీటికి పైవైపుకు వచ్చే చేపలను పట్టేసుకొని తింటూ ఉంటుంది. గూళ్ల నిర్మాణం విషయంలో ఉత్తర అమెరికా పరిధిలో ఉండే పక్షి, జంతు జాతుల్లో బాల్డ్ ఈగల్‌కు సాటివచ్చేవి మరేవీ లేవు.
అన్ని పక్షి, జంతుజాతుల కన్నా పెద్దసైజు గూళ్లను కట్టుకొంటుంది. ఈ జాతిలో పరిమాణం విషయంలో మగపక్షుల కన్నా ఆడ పక్షులే పెద్దగా ఉండటం విశేషం. యునెటైడ్ స్టేట్ ఆఫ్ అమెరికా పరిధిలో ఈ పక్షులు విస్తృతంగా ఉంటాయి. అందుకే దీన్ని అమెరికన్లు తమ జాతీయ పక్షిగా గౌరవిస్తున్నారు, తమ జాతీయ చిహ్నంలో కూడా స్థానమిచ్చారు. జీవనక్రమంలో ఈకలేమీ ఊడిపోకపోయినా దీన్ని ‘బాల్డ్ ఈగల్’గానే వ్యవహరిస్తారు. ఖతార్ దేశ నాణేలపై కూడా ఈ పక్షి ఉంటుంది.