అటవీప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే జాతీయ పక్షి నెమలి జాతి నానాటికి కనుమరుగవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఏజన్సీలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారులు, పొలాలు, గ్రామశివారుల్లో కనిపించేవి. ఇప్పడు చూద్దామంటే మచ్చుకై నా వాటి జాడ కనిపించడం లేదు.ఎక్కడో లోతట్టు అటవీ ప్రాంతంలో తప్ప, మిగతా ప్రదేశాల్లో నెమలి అరుపులు వినిపించడం లేదు.
వై.రామవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నెమళ్ల జాడ కనిపించడం లేదు. ఒకప్పుడు 10 వేల వరకు వీటి సంతతి ఉండేది. ఇప్పుడు మూడు వేలకు లోపే ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇవి అంతరించి పోవడానికి వెనుక చాలా కారణాలు లేకపోలేదు.
► వేటగాళ్లు విచ్చలవిడిగా వేటాడుతున్నారు. కొంతమంది విద్యుత్ అమర్చడం వల్ల మృత్యువాతపడుతున్నాయి.
► పొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందుల ప్రభావం కూడా నెమళ్ల సంతతిపై చూపుతోంది. ఆహార ధాన్యాలు తినేందుకు వస్తున్న నెమళ్లు పురుగు క్రిమిసంహారక మందుల అవశేషాలు కారణంగా మృత్యువాత పడుతున్నాయి. వై.రామవచం మండల సరిహద్దు గ్రామాలైన దబ్బపాలెం, నంగలకొండ, చాకిరేవులు తదితర గ్రామాల్లో పురుగుమందులు అవశేషాలున్న పంటలను తిని నెమళ్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి.
► కొంతమంది అడవిలో నెమళ్లు పెట్టిన గుడ్లను, వాటి పిల్లలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా కూడా వాటి సంతతి వృద్ధి చెందడం లేదు.
► మైదాన ప్రాంతానికి చెందిన వేటగాళ్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆవుల సాయంతో నెమళ్లను వేటాడేవారు. ఆవుల చాటున మాటువేసి నెమళ్లను పట్టుకుని హతమార్చేవారు. లోతట్టు ప్రాంతాలైన జంగాలకోట, బురదకోట, రాములుకొండ పరిసరాల్లో ఈ రకం వేట ఎక్కువగా జరిగేది. అప్పటిలో మావోయిస్టులు ప్రభావం ఎక్కువగా ఉన్నందున అటవీసిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించలేకపోయేవారు.
► పోడు వ్యవసాయం పేరిట అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఈ కారణంగా కూడా మరో ప్రాంతానికి వలసిపోయే అవకాశాలు ఉన్నాయి.
► వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా వాటి ప్రయోజనం కనిపించడం లేదు.
విద్యుత్ కంచెకు ప్రాణాలు బలి
నెమళ్లు, అడవి జంతువుల కోసం ఏర్పాటుచేస్తున్న విద్యుత్ కంచె ప్రాణనష్టం జరుగుతోంది. వై.రామవరం మండలంలో విద్యుత్ కంచెలో చిక్కుకుని గిరిజనులు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. పదేళ్లక్రితం చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన కుర్రే వెంకటేశ్వర్లు, గిరిజనుడు విద్యుత్ కంచెకు బలయ్యాడు. గతేడాది మండలంలోని సింహాద్రిపాలేనికి చెందిన ఓ గిరిజనుడు మృత్యువాత పడ్డాడు.
ప్రత్యేక విభాగం ఉన్నా..
వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అటవీశాఖలో ప్రత్యేక విభాగం ఉంది. రంపచోడవరం అటవీడివిజన్‌కు రాజమహేంద్రవరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనికి డీఎఫ్‌వో స్థాయి అధికారి ఉంటారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం అందిస్తే తగిన రక్షణ చర్యలు చేపడతారు.
చట్టపరమైన చర్యలుతీసుకుంటాం
వన్యప్రాణులను వేటాడటం, హతమార్చడం చట్టరీత్యానేరం. ఎక్కడైనా వేటాడితే వెంటనే తమ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి తెలియజేస్తాం.
– సత్యనారాయణ,డిప్యూటీ రేంజి అధికారి, వై.రామవరం
Comments
Please login to add a commentAdd a comment