అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్‌ ఈగల్‌ | Bald eagle officially declared US national bird after 250 years | Sakshi
Sakshi News home page

అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్‌ ఈగల్‌

Published Fri, Dec 27 2024 6:05 AM | Last Updated on Fri, Dec 27 2024 6:05 AM

Bald eagle officially declared US national bird after 250 years

దశాబ్దాల చిహ్నానికి అధికారిక హోదా 

వాషింగ్టన్‌: అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగ (బాల్డ్‌ ఈగల్‌)ను అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ఆమోదించిన బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచీ యూఎస్‌ గ్రేట్‌ సీల్‌పై, డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైనా ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు.

 తర్వాత అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు జరిగాయి. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధుమ రంగు శరీరంతో కూడిన బాల్డ్‌ ఈగల్‌ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్‌ డిసెంబర్‌ 16న సెనెట్‌లో బిల్లు ప్రవేశ పెట్టారు. దాన్ని సభ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బైడెన్‌ ఆమోదముద్రతో 240 ఏళ్ల తరవాత బాల్డ్‌ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా దక్కింది. 

తొలిసారి రాగి సెంటుపై 
బాల్డ్‌ ఈగల్‌ ఉత్తర అమెరికాకు చెందిన పక్షి. మొట్టమొదట 1776లో మసాచుసెట్స్‌ రాగి సెంటుపై ఇది అమెరికా చిహ్నంగా కనిపించింది. తర్వాత వెండి డాలర్, హాఫ్‌ డాలర్, క్వార్టర్‌ తదితర యూఎస్‌ నాణేల వెనుక భాగంలో చోటుచేసుకుంది. బంగారు నాణేలకు ఈగల్, హాఫ్‌ ఈగల్, క్వార్టర్‌ ఈగల్, డబుల్‌ ఈగల్‌ అని నామకరణమూ చేశారు. 1940 జాతీయ చిహ్న చట్టం కింద బాల్డ్‌ ఈగల్‌ రక్షిత పక్షి. దాన్ని క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం. ‘‘బాల్డ్‌ ఈగల్‌ను 250 ఏళ్లుగా జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తూ వస్తున్నాం. దాన్నిప్పుడు అధికారికంగా ప్రకటించుకున్నాం’’అని నేషనల్‌ ఈగల్‌ సెంటర్‌ నేషనల్‌ బర్డ్‌ ఇనిషియేటివ్‌ కో చైర్మన్‌ జాక్‌ డేవిస్‌ ఒక ప్రటకనలో తెలిపారు. ఈ అర్హత మరే పక్షికీ లేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement