baldiya
-
బల్దియా బడ్జెట్ రూ.11,538 కోట్లు
సాక్షి, సిటీబ్యూరో: 2019–20 ఆర్థిక సంవత్సరానికి బల్దియా భారీ బడ్జెట్ రూపొందించింది. రూ.11,538 కోట్లతో ముసాయిదా సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత గురువారం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. తర్వాత సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రతిపక్షాలు లేనందున.. బహుశా యథాతథంగా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం ఉంది. వాస్తవానికి జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.6,150 కోట్లే అయినప్పటికీ ఇతర కార్పొరేషన్ల నుంచి భారీ ప్రాజెక్టులకు రూ.5,388 కోట్ల నిధులు అందుతాయని భావిస్తున్న బల్దియా మొత్తం రూ.11,538 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. ప్రతిఏటా బడ్జెట్ పెరగాలే తప్ప తగ్గరాదనే సాధారణ నియమయే ప్రాతిపదికగా జీహెచ్ఎంసీ బడ్జెట్ గతేడాది రూ.6,076.86 కోట్లుండగా... ఈసారి దాన్ని స్వల్పంగా పెంచి రూ.6,150 కోట్లుగా చూపారు. వాస్తవ పరిస్థితుల్ని కొంతమేర పరిగణనలోకి తీసుకొని ఇతర కార్పొరేషన్ల నుంచి ప్రాజెక్టులకు అందే నిధులు గతేడాది రూ.7,073.14 కోట్లుండగా, ఈసారి రూ.5,388 కోట్లకు తగ్గించారు. అయినప్పటికీ వస్తాయనుకున్న నిధులు, చేస్తున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ప్రతిఏటా ఆమోదిస్తున్న బడ్జెట్లో దాదాపు సగం బడ్జెట్‌ను మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సైతం రూ.13,150 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ, తొలి ఆరు నెలల్లో కేవలం రూ.2,461.05 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఖజానాకు వచ్చిన నిధులు కూడా రూ.2,741 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఆదాయం, ఖర్చు బొటాబొటిగా ఉన్నాయి. ఎప్పుడూ అంతే! మిగతా ఆరు నెలల్లో దాదాపు మరో రూ.4వేల కోట్లు చేసినా రూ.6వేల కోట్లు మాత్రమే అవుతుంది. 2017–18లో రూ.5,643 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ కేవలం రూ.3,736.80 కోట్లే ఖర్చు చేశారు. అలాగే 2016–17లోనూ రూ.5,600 కోట్లతో బడ్జెట్ ఆమోదించగా... రూ.2,782.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన కొత్త బడ్జెట్ సైతం అంకెల ఘనంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను, అసైన్డ్ రెవెన్యూ తదితర వెరసి రూ.3,325 కోట్లు రాగలవని అనుకున్నప్పటికీ ఆరు నెలల్లో రూ.1,279 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆస్తి పన్ను రూ.1,725.20 కోట్లుగా బడ్జెట్లో చూపినప్పటికీ ఇప్పటి వరకు వసూలైంది దాదాపు రూ.750 కోట్లు మాత్రమే. తగ్గిన రివైజ్డ్ బడ్జెట్ గతేడాది రివైజ్డ్ బడ్జెట్‌ను పెంచినప్పటికీ, ఈసారి కాస్త వాస్తవిక దృక్పథంతో తగ్గించారు. దాన్ని రూ.13,150 కోట్ల నుంచి రూ.8,935 కోట్లకు తగ్గించారు. అయితే ఇదైనా అమలు చేయగలరా అన్నదే సందేహం. జీహెచ్ఎంసీ పర్యవేక్షించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రహదారుల పనులకు హౌసింగ్ కార్పొరేషన్, హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్)ల నుంచి భారీ మొత్తాల్లో గ్రాంట్స్ వస్తాయనే అంచనాతో క్యాపిటల్ ఖర్చును ఎక్కువగా చూపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇచ్చే నిధులను కూడా లెక్కించి ప్రస్తుత బడ్జెట్లోనూ రూ.6,317.69 కోట్లు కేటాయించినప్పటికీ, వాటిని రివైజ్డ్ బడ్జెట్లో రూ.3,410 కోట్లకు తగ్గించారు. రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పటికీ, రివైజ్డ్‌లో రూ.150 కోట్లకు పరిమితం చేశారు. ♦ కొత్త బడ్జెట్ (2019–20)లో పెద్ద ప్రాజెక్టుల కింద ఇతర కార్పొరేషన్ల నుంచి అందే నిధులను రూ.5,388 కోట్లుగా చూపారు. అందులో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.200 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇతర ఇళ్ల అభివృద్ధికి హౌసింగ్ కార్పొరేషన్ రూ.5,188 కోట్లు. ‘డబుల్’ ఇళ్లు,ఎస్సార్డీపీ పనులకు ప్రాధాన్యం... ప్రస్తుతం బడ్జెట్ లాగే కొత్త బడ్జెట్లోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నాలాల ఆధునికీకరణ, ఎస్సార్డీపీ ప్రాజెక్టులు, రహదారుల పనులకు ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వీటికోసం చేసిన ఖర్చులు చూస్తే.. రానున్న ఏడాదిలో ఎంతవరకు అమలవుతాయన్నది సందేహమే. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రస్తుత బడ్జెట్లో రూ.6,317.70 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.992.86 కోట్లు మాత్రమే అందింది. బహుళ వరుసల ఫ్లైఓవర్లు, రహదారుల అభివృద్ధి తదితర ఎస్సార్డీపీ పనుల కోసం ప్రస్తుత బడ్జెట్లో రూ.1,802 కోట్లు బాండ్ల జారీ, బ్యాంకు రుణాల ద్వారా తీసుకోనున్నట్లు పేర్కొన్నప్పటికీ.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ.195 కోట్లు మాత్రమే తీసుకున్నారు. అలాగే వరద కాలువల ఆధునికీకరణ పనుల కోసం ప్రస్తు బడ్జెట్లో రూ.361.45 కోట్లు కేటాయించినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం రూ.58.27 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రహదారులు, ఫుట్‌పాత్‌ల కోసం రూ.2,173.77కోట్లు కేటాయించినప్పటికీ, రూ.380.59 కోట్లే ఖర్చు చేశారు. ఈ లెక్కన భారీ బడ్జెట్ కాగితాలకే పరిమితం కానుంది. గతేడాది లాగే ఈసారి సైతం జీహెచ్ఎంసీ నిధులకు సంబంధించి ‘ఎ’ భాగంగా, జీహెచ్ఎంసీ పర్యవేక్షించే పనులకు ఇతర కార్పొరేషన్ల నుంచి అందే నిధులను ‘బి’ బడ్జెట్‌గా రూపొందించారు. -
రామగుండం బల్దియాకు పవర్‌కట్
రూ.2.20 కోట్ల విద్యుత్ బకాయిలు కోల్‌సిటీ: విద్యుత్ బిల్లులు చెల్లించలేదని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయానికి ట్రాన్స్‌కో విభాగం అధికారులు శనివారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఇన్చార్జి కమిషనర్ సీఆర్.బాబు, ఇతర అధికారులు సెల్‌ఫోన్ వెలుతురులో విధులు నిర్వహించారు. రూ.2.20 కోట్ల విద్యుత్ వినియోగ బకాయిలు చెల్లించకపోడంతోనే ట్రాన్స్‌కో ఎస్ఈ ఆదేశాల మేరకు కరెంట్ కట్ చేసినట్టు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. బకాయిలు చెల్లించాలని గతంలోనే అనేకసార్లు నోటీసులు జారీ చేసినా కార్పొరేషన్ అధికారులు స్పందించలేదని ఆయన వెల్లడించారు. సుమారు రూ.2.20 కోట్ల బకాయిల్లో హెచ్‌టీ బిల్లులు రూ.1.80 కోట్లు ఉండగా, మిగితా బిల్లులు ఎల్టీ కనెక్షన్లవి ఉన్నాయ ని ఏఈ వివరించారు. ఎల్టీ బిల్లులు రెగ్యులర్‌గా చెల్లింపులు జరుపుతున్నప్పటికీ హెచ్‌టీ బకాయిలు చెల్లించడం లేదని, ప్రతీ నెలా నోటీసులు జారీ చేస్తున్నా స్పందించడం లేదని అన్నారు. గతేడాది కూడా విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ట్రాన్స్‌కో అధికారులు రెండుసార్లు కార్పొరేషన్ కార్యాలయాని కి కరెంటు సరఫరాను నిలిపివేశారు. వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎల్టీ బిల్లులు రూ.16 లక్షల వరకు చెల్లించడానికి డబ్బులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆడిట్ ఎగ్జామినర్ అందుబాటులో లేకపోడంతో సమస్య వచ్చిందని ఇన్చార్జి కమిషనర్ తెలిపారు. -
రంగులు మారుతున్న రాజకీయం
కామారెడ్డి : కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో కామారెడ్డి బల్దియా రాజకీయం రంగులు మారుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కారు జోరులో కనిపిస్తోంది. చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకున్నా.. సభ్యులను కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బల్దియాలో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఫలిస్తుందా? చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పై‘చేయి’ నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. కామారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మెజారిటీ స్థానాలను గెలుచుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి తొలినాళ్లలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బల్దియా చైర్మన్‌గా పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ కొందరు కౌన్సిలర్లు నారాజ్‌గా ఉన్నారు. వారు కోఆప్షన్ ఎన్నికలను ఆయుధంగా వాడుకుని తిరుగుబాటు చేశారు. ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. దీంతో 17 మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం 13కు పడిపోయింది. బల్దియా ఎన్నికల్లో పార్టీ టికెట్టుపై ఐదుగురు కౌన్సిలర్లనే గెలిపించుకున్న టీఆర్ఎస్.. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఆకర్షిస్తూ బలాన్ని పెంచుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ముగ్గురు టీఆర్ఎస్లో చేరారు. తాజాగా కాంగ్రెస్ సభ్యుల చేరికతో ఆ పార్టీ బలం 12 కు చేరింది. బుధవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కోఆప్షన్ సభ్యులుగా తమ పార్టీ వారిని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచినవారు, ఆ తర్వాత పార్టీలో చేరినవారితో పాటు ముగ్గురు బీజేపీ సభ్యులను కలుపుకొని మొత్తం 15 మంది ఇప్పటికే క్యాంప్‌నకు వెళ్లారు. సీపీఎం కౌన్సిలర్ మద్దతు కూడా టీఆర్ఎస్కే ఉంది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటుతో కలిపి టీఆర్ఎస్ బలం 17కు చేరుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం పదమూడు మంది కౌన్సిలర్లున్నారు. ఒకవేళ టీఆర్ఎస్తో వెళ్లని బీజేపీ సభ్యులు ఇద్దరు మద్దతిస్తే కాంగ్రెస్ బలం 15కు చేరుతుంది. స్వతంత్రుడితోపాటు, ఎంఐఎం కౌన్సిలర్ ఎవరికి మద్దతిస్తారనేది ఇంకా తేలలేదు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఓటుతో కాంగ్రెస్ బలం 18కి చేరుతుంది. కోఆప్షన్ సభ్యులుగా ఆ పార్టీ నేతలు ఎన్నికవుతారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులు సైతం తమకు మద్దతిస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో ఉన్న కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తామెవరం పార్టీ వీడి వెళ్లడం లేదని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. ఎత్తుకు పైఎత్తులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీలు ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చేరిన నిట్టు వేణుగోపాల్రావ్ తన సోదరుడు కృష్ణమోహన్రావ్ను కోఆప్షన్ సభ్యునిగా గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే బల్దియాలో పూర్తి మెజారిటీ ఉన్న కా్రంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను లాక్కుని కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేయించుకునేందుకు టీఆర్ఎస్ చేసిన మొదటి ప్రయత్నంలో నలుగురు కౌన్సిలర్లు చిక్కారు. మరో ముగ్గురు తమవైపునకు వస్తే ఈజీగా కోఆప్షన్ సభ్యులను గెలిపించుకోవచ్చనే భావనతో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బల్దియాలో ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ వర్గం సైతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. -
వరద సహాయక చర్యలకు టోల్ ఫ్రీ నంబర్
*బల్దియాలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూం 18004251980 *53 డివిజన్లు, 42 విలీన గ్రామాలకు సేవలు *24 గంటలపాటు సేవలందించేలా ఏర్పాట్లు వరంగల్ : వర్షాకాలం నేపథ్యంలో ఉత్పన్నమయ్యే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ముంపు ప్రాంతాలు, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 53 డివిజన్లతోపాటు నగరంలో విలీనమైన 42 గ్రామాల్లో సత్వర సహాయక చర్యలు చేపట్టడంలో భాగంగా 18004251980 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు వరంగల్‌లోని బల్దియా ప్రధాన కార్యాలయంలో రౌండ్ ది క్లాక్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు ఫిర్యాదులు స్వీకరిం చేలా ఉద్యోగులకు విడతల వారీగా విధులు కేటాయించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 4... సాయంత్రం 4 నుంచి రాత్రి 12... రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు ఒక్కొక్కరు విధులు నిర్వర్తించనున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారు నమోదు చేసుకుంటారని... ఆ తర్వాత నోడల్ అధికారులు వెంటవెంటనే సహాయక చర్యలు చేపట్టనున్నట్లు బల్దియా అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్ తెలిపారు.