రంగులు మారుతున్న రాజకీయం | changing political issues in district | Sakshi
Sakshi News home page

రంగులు మారుతున్న రాజకీయం

Published Wed, Jul 30 2014 2:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

changing political issues in district

కామారెడ్డి : కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో కామారెడ్డి బల్దియా రాజకీయం రంగులు మారుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కారు జోరులో కనిపిస్తోంది. చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకున్నా.. సభ్యులను కాపాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బల్దియాలో ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఫలిస్తుందా? చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పై‘చేయి’ నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.
 
 కామారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మెజారిటీ స్థానాలను గెలుచుకుని చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి తొలినాళ్లలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. బల్దియా చైర్మన్‌గా పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ కొందరు కౌన్సిలర్లు నారాజ్‌గా ఉన్నారు. వారు కోఆప్షన్ ఎన్నికలను ఆయుధంగా వాడుకుని తిరుగుబాటు చేశారు. ఇప్పటికే నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా ఆ పార్టీకి షాక్ ఇచ్చారు.
 
దీంతో 17 మంది కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం 13కు పడిపోయింది. బల్దియా ఎన్నికల్లో పార్టీ టికెట్టుపై ఐదుగురు కౌన్సిలర్లనే గెలిపించుకున్న టీఆర్‌ఎస్.. ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ఆకర్షిస్తూ బలాన్ని పెంచుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్ సభ్యుల చేరికతో ఆ పార్టీ బలం 12 కు చేరింది.
 
బుధవారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కోఆప్షన్ సభ్యులుగా తమ పార్టీ వారిని గెలిపించుకోవడానికి టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. తమ పార్టీ గుర్తుపై గెలిచినవారు, ఆ తర్వాత పార్టీలో చేరినవారితో పాటు ముగ్గురు బీజేపీ సభ్యులను కలుపుకొని మొత్తం 15 మంది ఇప్పటికే క్యాంప్‌నకు వెళ్లారు. సీపీఎం కౌన్సిలర్ మద్దతు కూడా టీఆర్‌ఎస్‌కే ఉంది. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఓటుతో కలిపి టీఆర్‌ఎస్ బలం 17కు చేరుతుంది.
 
ఇదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం పదమూడు మంది కౌన్సిలర్లున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌తో వెళ్లని బీజేపీ సభ్యులు ఇద్దరు మద్దతిస్తే కాంగ్రెస్ బలం 15కు చేరుతుంది. స్వతంత్రుడితోపాటు, ఎంఐఎం కౌన్సిలర్ ఎవరికి మద్దతిస్తారనేది ఇంకా తేలలేదు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తే ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఓటుతో కాంగ్రెస్ బలం 18కి చేరుతుంది. కోఆప్షన్ సభ్యులుగా ఆ పార్టీ నేతలు ఎన్నికవుతారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన మరో ముగ్గురు సభ్యులు సైతం తమకు మద్దతిస్తారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో ఉన్న కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తామెవరం పార్టీ వీడి వెళ్లడం లేదని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.
 
ఎత్తుకు పైఎత్తులు
మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీలు ఈ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన నిట్టు వేణుగోపాల్‌రావ్ తన సోదరుడు కృష్ణమోహన్‌రావ్‌ను కోఆప్షన్ సభ్యునిగా గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే బల్దియాలో పూర్తి మెజారిటీ ఉన్న కా్రంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను లాక్కుని కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేయించుకునేందుకు టీఆర్‌ఎస్ చేసిన మొదటి ప్రయత్నంలో నలుగురు కౌన్సిలర్లు చిక్కారు. మరో ముగ్గురు తమవైపునకు వస్తే ఈజీగా కోఆప్షన్ సభ్యులను గెలిపించుకోవచ్చనే భావనతో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బల్దియాలో ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్సీ వర్గం సైతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement