ఒంగోలు జాతి అంతరించిపోవడం లేదు
వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి ప్రశ్నకు మంత్రి బలియన్ సమాధానం
న్యూఢిల్లీ: దేశంలో ఒంగోలు జాతి పశువులు అంతరించిపోవడంలేదని, వాటి సంఖ్య 2,57,661గా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బలియన్ స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 కోట్ల నుంచి 40 కోట్లు విలువ ఉన్న ఒంగోలు ఎద్దుల జీవ ద్రవ్యా న్ని తీసుకోడానికి బ్రెజీలిన్ అనుమతులు కోరడానికి సంబంధించిన సమాచారంపై పొంగులేటి వివరాలు కోరారు.
చెన్నైలోని జాతీయ జీవ వైవిధ్య మండలి (ఎన్బీఏ) నుంచి ఒంగోలు జాతి పశువుల జీవద్రవ్యం(జెర్మ్ ప్లాస్మ్) తీసుకోవడానికి బ్రెజీలి యన్ అనుమతులు కోరుతున్న విషయం వాస్తవమేనని మంత్రి బదులిచ్చారు. జీవ ద్రవ్య సదుపాయం, లాభాల భాగస్వామ్యంపై ఎన్బీఏ నిపుణల కమిటీని 2005లో ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఎన్బీఏకు అందే దరఖాస్తుల పరిశీలనకు సమయానుసారంగా కమిటీ తిరిగి ఏర్పాటవుతుందని తెలిపారు.