Balijipeta phc
-
రోగుల ప్రాణాలతో చెలగాటం..
సాక్షి, బలిజిపేట (విజయనగరం): ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లిన మాత్రలు రోగులకిస్తూ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధి అయిన డయేరియా నివారణకు మెట్రోజోల్ మాత్రలు ఇస్తుంటారు. అయితే ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది అందజేస్తున్నారంటే వారికి రోగుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కాలం చెల్లిన మాత్రలు పీహెచ్‌సీల్లో ఉంటే వాటిని కాల్చివేయాలి. కాని సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా రోగులకు ఎక్స్పైరీ అయిన మాత్రలను ఇస్తున్నారు. బలిజిపేట పీహెచ్సీలో డయేరియా రోగులకు కాలం చెల్లిన మాత్రలు ఇచ్చారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. 2018 అక్టోబర్ నాటికి ఎక్స్పైరీ అయిన మెట్రోజోల్ మాత్రలను సిబ్బంది ఇచ్చారు. ఇవేమీ తెలియని రోగులు ఆ మాత్రలు మింగేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న రోగులు తమకేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా వచ్చే రోగులు పీహెచ్‌సీకి ఎక్కువగా గర్భిణులు, బాలింతలు, కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు, సుగర్, బీపీ రోగులు ఎక్కువగా వస్తుంటారు. వీరితో పాటు డయేరియా, వైరల్ జ్వరాల బారిన పడ్డవారు కూడా పీహెచ్‌సీని ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు కాలం చెల్లిన మాత్రలు ఇస్తున్నారంటూ బయటకు పొక్కడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇండెంట్ పీహెచ్సీ ఆధారంగా ఇండెంట్ పెడుతుంటారు. పీహెచ్‌సీలకు సంబంధించిన మందులు జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి అక్కడ నుంచి తిరిగి వస్తాయి. బలిజిపేట పీహెచ్‌సీకి మూడు నెలలకొకసారి రూ. 1.50 లక్షలతో ఇండెంట్ పెడతారు. పర్యవేక్షిస్తాం.. బలిజిపేట పిహెచ్సీలో కాలం చెల్లిన మందులు లేవు. ఒకవేళ ఉంటే అటువంటి వాటిని గుర్తించి పక్కన పెట్టస్తాం. దీనిపై పర్యవేక్షణ జరుపుతాం. – మహీపాల్, వైద్యాధికారి, బలిజిపేట పీహెచ్సీ. -
వైద్యాధికారి కనిపించుట లేదు
ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరు ఆగస్టు 9న తీసుకొచ్చిన డీఎంహెచ్‌వో ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు బలిజిపేట పీహెచ్సీలో రోగుల అవస్థలు బలిజిపేట రూరల్: సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించారు. డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. అయినా బలిజిపేట పీహెచ్సీ తీరు మారలేదు. రోగులకు అవస్థలు తప్పడం లేదు. 24గంటల పీహెచ్‌సీని పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు జూలై 27న సందర్శించి అసంతప్తి వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వోతో మాట్లాడగా వెద్యాధికారిని నియమిస్తున్నట్టు ప్రకటించినా అది మూడురోజుల ముచ్చటైంది. డీఎంహెచ్‌వో శారద ఆగస్టు 9న పీహెచ్‌సీని సందర్శించారు. తనతో పాటు విజయ్‌మోహన్ అనే వైద్యాధికారిని తీసుకువచ్చి ఆయన బలిజిపేట పీహెచ్సీలో వైద్యసేవలందిస్తారని అందరికీ పరిచయం చేశారు. ఆ రోజు తరువాత ఇప్పటి వరకు విజయ్‌మోహన్ పీహెచ్సీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక రోజు రోగులు రావడం, వైద్యాధికారి కోసం నిరీక్షించడం సర్వసాధారణమైంది. తుమరాడ గ్రామానికి చెందిన త్రినాథ, గడ్డెయ్య, శివడవలసకు చెందిన వి.శాంతి అనారోగ్యంతో బుధవారం బలిజిపేట పీహెచ్‌సీకి వచ్చారు. కానీ వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో నిరాశతో తిరుగుముఖం పట్టారు. వైద్యాధికారి ఉంటే రోజుకు సుమారు 100మంది వరకు రోగులు పీహెచ్‌సీకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదేం పాలన: పార్వతి, బలిజిపేట నిరుపేదలకు అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 24గంటల పీహెచ్‌సీకి కనీసం ఒక వైద్యాధికారిని నియమించలేకపోవడం దారుణం. నిరుపేదలకు వైద్యం దూరమవుతోంది. ప్రయివేటు వైద్యమే శరణ్యం: వి.సుబ్బారావు, పీహెచ్సీ అభివద్ధి కమిటీ ౖచైర్మన్, బలిజిపేట ఎమ్మెల్యే చిరంజీవులు, డీఎంహెచ్‌వో శారదలు ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటివరకు వైద్యాధికారిని నియమించలేదు. రోగులకు ప్రయివేటు వైద్యమే దిక్కవుతోంది. పీహెచ్‌సీకి తాళాలు వేసుకోవడమే తప్పా వేరే మార్గం కనిపించటం లేదు. -
కుక్కకాటు బాధితుని హాహాకారాలు
24 గంటల పీహెచ్సీలో కానరాని సిబ్బంది బలిజిపేట రూరల్: కుక్కకాటు బాధితుడు వైద్యం కోసం బలిజిపేట పీహెచ్‌సీకి వస్తే సిబ్బంది లేకపోవడంతో విలవిల్లాడిపోయాడు. బాధితుడు భాస్కరరావు ఆదివారం ఉదయం పీహెచ్‌సీకి ఉదయం 10గంటల 30 నిమిషాలకు వచ్చాడు. 24 గంటల పీహెచ్సీ అయినప్పటికీ సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఉదయం 11గంటలవుతున్నా ఎవరూ రాకపోవడం, కుక్కకాటు గాయం బాధపెడుతుండటంతో కలవరపడ్డాడు. పేరుకు 24గంటల పీహెచ్సీ అయినా వైద్యాధికారి సహా, మిగిలిన సిబ్బంది అందుబాటులో లేరు. రెగ్యులర్ స్టాఫ్‌నర్స్ సెలవులో ఉన్నందున వేరొకరు విధులు నిర్వహించాల్సి ఉంది. రెండో స్టాఫ్‌నర్స్ 11 గంటలు దాటాక వచ్చి వైద్యం చేశారు. జ్వరంతో బాధపడుతున్న మరో రోగి కూడా ఆస్పత్రిలో నిరీక్షించాల్సి వచ్చింది. కంటింజెంట్ వర్కరు మాత్రమే పీహెచ్సీలో విధుల్లో ఉండటంతో రోగులు ఇబ్బంది పడ్డారు.