బంతి తగిలి.. కుప్పకూలిన క్రికెటర్
మరో యువ క్రికెటర్ మైదానంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రి పాలయ్యాడు. శ్రీలంక టెస్టు జట్టులోని ఓ పెనర్ కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్లు తీయించారు. అవన్నీ బాగానే ఉన్నాయి గానీ, తదుపరి పరీక్షల కోసం అతడిని రాజధాని కొలంబోకు తరలించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. సిల్వ ఇప్పటివరకు శ్రీలంక జట్టు తరఫున 24 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 1,404 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 31. షార్ట్‌లెగ్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తుండగా సిల్వకు బాల్ తగిలిందని టీమ్ మేనేజర్ సేనానాయకే తెలిపారు. శ్రీలంక జట్టు వైస్ కెప్టెన్ దినేష్ చండీమల్ వెంటనే కౌశల్ తల వెనకవైపునకు పరుగెత్తి, దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించినా, అప్పటికే బాల్ తగిలింది.
గతంలో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూస్ ఇలాగే బాల్ తలకు తగలడంతో 2014 నవంబర్‌లో మరణించాడు. ఆ తర్వాతి నుంచి ఆటగాళ్ల భద్రత కోసం అదనపు ప్యాడింగ్తో కూడిన హెల్మెట్లను ఉపయోగిస్తున్నారు. బాల్ తగిలే సమయానికి సిల్వ అలాంటి హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో శ్రీలంక జట్టు పర్యటన ఉండటంతో దానికి సన్నాహకంగా జరిగిన మ్యాచ్‌లోనే సిల్వ గాయపడ్డాడు.