వాట్సప్‌పై త్వరలో నిషేధం?
సోషల్ మీడియా, ఆన్లైన్ మెసేజింగ్ సర్వీసులపై కఠిన చట్టాల నేపథ్యంలో.. త్వరలోనే బ్రిటన్‌లో 'వాట్సప్'పై నిషేధం వేటు పడేలా ఉంది. కొత్త చట్టాన్ని అమలుచేయాలని ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఏరకమైన ఎన్క్రిప్టెడ్ మెసేజిలైనా పంపకుండా ప్రజలను అడ్డుకోవాలని ఆయన అంటున్నారు. దీంతో వాట్సప్ సహా ఐమెసేజ్, స్నాప్‌చాట్ లాంటి అనేక మెసేజింగ్ సర్వీసులు త్వరలోనే ఆ దేశంలో మూతపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చట్టాన్ని అమలుచేస్తే వెనువెంటనే యూకేలో ఈ మూడూ చట్ట వ్యతిరేక సర్వీసులు అయిపోతాయి.
మనం చదవలేని సందేశాలు ప్రజలు మధ్య వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేమని ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ సమావేశంలో కామెరాన్ అన్నారు. యూజర్ ప్రైవసీ విషయాన్ని వాట్సప్ ఏమాత్రం పట్టించుకోదని అంటున్నారు. గూగుల్ సెర్చి చేసినా, ఫేస్బుక్లో చాటింగ్ చేసినా, వాట్సప్ గ్రూపుల్లో సందేశాలు పంపుకొన్నా, స్నాప్‌చాట్ వీడియో సందేశాలు చూసుకున్నా.. ఇవన్నీ కూడా ఇంగ్లండ్ పోలీసులకు, ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి రావాలన్నది సర్కారు ఉద్దేశం.