Hyderabad: తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. విభిన్న భాషల మేలు కలబోతతో విలసిల్లుతున్న హైదరాబాద్.. భాషలో, యాసలో ఆంగ్ల అనుకరణం కారణంగా కొన్నాళ్లుగా తెలుగుపై కాస్త మక్కువ తగ్గింది.
ప్రస్తుతం నగర వేదికగా సంగీత వేదికలపై తెలుగు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ రాక్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన వేదికలపైనే ఇప్పుడు తెలుగు పాటలు, జానపద సాహిత్యం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్ బ్యాండ్స్ నగరంలో సందడి చేసేవి. కానీ ఇప్పుడు దాదాపు పాతిక తెలుగు బ్యాండ్స్ ప్రాంతీయ భాషలో అలరిస్తున్నాయి. నగరంలోని బార్లు, పబ్‌లలో జస్టిన్ బీబర్ సాంగ్స్‌కు బదులు బుల్లెట్టు బండి పాటలు మార్మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొడితే ఎలక్ట్రిక్ మ్యూజిక్కు బదులు టాలీవుడ్ మాస్ పాటలు వినిపిస్తున్నాయి.
నగర జీవన విధానంలో పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక స్థానముంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్, క్లబ్‌లలో ఇంగ్లిష్, హిందీ సంగీతం వినిపించేది. కొన్నేళ్లుగా ఈ స్పాట్లలో తెలుగు పాటలు ప్రారంభమయ్యాయి. కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం కేవలం తెలుగు సాహిత్యమే ప్రధానాంశంగా ప్రారంభించాయి. అయిదేళ్ల క్రితం ఇలాంటివి రెండు, మూడు ఉంటే ఇప్పుడు 40 వరకు పెరిగాయి.
ఈ మధ్య కాలంలో అనూహ్యంగా తెలుగు బ్యాండ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్‌పైన లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌తో మెలోడీ, మాస్, క్లాస్, జానపద పాటలు అలరిస్తుంటే ఫుడ్, సిప్‌ను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఈ పరిణామంతో తెలుగు బ్యాండ్స్‌కు ఉపాధి పెరిగింది. తెలుగు మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కోవిడ్ కారణంగా కాస్త నెమ్మదించాయి. నైట్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో మాత్రం తెలుగు పాటలే కొత్త ట్రెండ్. నగరం నలుమూలల్లోని ఏ బార్, రెస్టారెంటైనా తెలుగు పాటే క్రేజీనెస్. తెలుగు సాహిత్యం ఉన్న రిసార్ట్స్, బార్లకు కస్టమర్లు కుటుంబ సమేతంగా వస్తుండటం విశేషం.
తెలుగు సాహిత్యమే ప్రస్తుత నేపథ్యం..
నగరవాసులు ఇప్పుడు తెలుగు పాటల ట్రెండ్‌నే అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే ప్రదర్శించాలనే నేపథ్యంతోనే తబులా రాసా బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు లైవ్ మ్యూజిక్ బ్యాండ్లకు మంచి వేదికను ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో తెలుగు పాటలను వింటూ కుటుంబంతో సరదాగా గడపాలనే వారి సంఖ్య పెరిగింది. నైట్ కల్చర్‌కు పేరొందిన ప్రదేశాల్లో తెలుగు పాటలున్నవాటినే ముందు రిజర్వ్ చేసుకుంటున్నారు.
– జువ్వాడి శ్రవణ్, తబులా రాసా వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్