Bandaru Madhava Naidu
-
మెడపట్టి గెంటేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం రూరల్(పశ్చిమగోదావరి): ఎస్సీ యువకులపై నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఓ యువకుడిని మెడపట్టి గెంటేశారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. మండలంలోని సరిపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రెండు రోజుల నుంచి హడావుడిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. నరసాపురం మండలం సరిపల్లి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు స్వగ్రామం. ఇక్కడ గత పాలకుల హయాంలోనే పంచాయతీకి నూతన భవనం నిర్మించారు. అయితే ఈ భవనం ఎస్సీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఉండటంతో ఎమ్మెల్యే మాధవనాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పంచాయతీ కార్యాలయాన్ని తమ సామాజికవర్గం ఉన్న ప్రాంతానికి మార్చాలని యత్నించారు. దీనిలో భాగంగా ఎంపీ తోట సీతారామలక్ష్మి కొత్త పంచాయతీ భవన నిర్మాణానికి గతేడాది జూలైలో శంకుస్థాపన చేశారు. ఎస్డీఎఫ్, ఉపాధిహామీ నిధులు రూ.37.50లక్షలతో ఈ పనులు చేపట్టారు. అయితే అప్పట్లో శంకుస్థాపన సందర్భంలోనూ రెండు కులాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అనంతరం వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లింది. అయినా ఎమ్మెల్యే మొండిగా కొత్త పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కొత్తభవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మాధవనాయుడు పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామస్తులు గమిడి మధుబాబు, మైలాబత్తుల కృష్ణంరాజు తదితరులు భవన నిర్మాణ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ప్రారంభించడం తగదని ఎమ్మెల్యేకు వివరించే యత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మాధవనాయుడు కోపంతో ఊగిపోతూ ఆ ఎస్సీ యువకులను మెడపై చేయివేసి బయటకు గెంటారు. ఈ పరిణామం నుంచి ఎస్సీ యువకులు తేరుకునేలోపే రూరల్ఎస్సై మూర్తి, తెలుగుదేశం చోటా నాయకులు ఒక్కటై వారిని ఈడ్చి పక్కకు లాగేశారు. ఈ పెనుగులాటలో యువకుల దుస్తులూ చిరిగాయి. ఈ తతంగం ఇలా జరుగుతుండగానే ఎమ్మెల్యే తన అధికారదర్పాన్ని ప్రదర్శిస్తూ కొత్తపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల ఆందోళన ఎమ్మెల్యేకు తీరుకు వ్యతిరేకంగా ఎస్సీ యువకులు గ్రామస్తులతో కలిసి నరసాపురం-భీమవరం రోడ్డుపై బైఠాయించారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఈ యువకులు రూరల్‌పోలీసు స్టేషన్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే, టీడీపీ చోటా నాయకులు, రూరల్ ఎస్సై తదితరులు తమపట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన చెందారు. అంతే కాకుండా ఎమ్మెల్యే మాధవనాయుడు తమను కులంపేరుతో దూషించారని ఆయనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన వారిలో మైలాబత్తుల రాజ్‌కుమార్, కేదాసు స్వరాజ్యకుమార్, మైలాబత్తుల కుటుంబరావు, ఏలూరి చంటి, ఉండ్రు స్టాలిన్, పి వెంకట్రావు, ఎం శరత్ తదితరులు ఉన్నారు. -
గ్రామస్తులపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
-
గ్రామస్తులపై చేయిచేసుకున్న నరసాపురం ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం : టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రౌడీలా ప్రవర్తించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని తరలించొద్దంటూ వేడుకున్నా వినకుండా వారిపై చేయిచేసుకున్నారు. ఈ సంఘటన నరసాపురం మండలంలోని సరిపల్లిగ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సరిపల్లి గ్రామంలోని పంచాయతీ భవన వివాదం కోర్టు పరిధిలో ఉంది. దానిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బండారు అక్కడకు చేరుకున్నారు. అయితే, వివాదంలో ఉన్న భవనాన్ని ప్రారంభించేందుకు వీలులేదని స్థానికులు అడ్డుచెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన మాధవనాయుడు గ్రామస్తులపై చేయిచేసుకున్నారు. మెడలు పట్టుకుని వారిని అక్కడ నుంచి గెంటేసి పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తీరుతో సరిపల్లిలో ఉద్రికత్తత తీవ్ర స్థాయికి చేరింది. మాధవనాయుడు రౌడీల ప్రవర్తించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళలపై ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం
ముగ్గురికి గాయాలు నరసాపురం మండలం కె.బేతపూడిలో దారుణం గ్రామస్తులే దాడి చేశారంటూ కేసు ఆక్వా పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఫలితం నరసాపురం రూరల్ : పోలీసుల సాయంతో పురుషులందరినీ గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రౌడీలు చెలరేగిపోయారు. మహిళలపై దాష్టీకానికి తెగబడ్డారు. ముగ్గురు మహిళల్ని గాయపరిచారు. విధ్వంసం సృష్టించి.. చివరకు అదంతా ప్రజలే చేశారంటూ కేసులు పెట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జన చైతన్య యాత్ర నిర్వహించేందుకు మండలంలోని కె.బేతపూడి గ్రామానికి చేరుకున్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆ గ్రామస్తులంతా వ్యతిరేకిస్తుండటంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి గ్రామంలోని పురుషులందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అడుగడుగునా పోలీసు కాపలా నడుమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీసేందుకు ప్రయత్నించగా, మాధవనాయుడు అనుచరులు, వారితో వచ్చిన రౌడీ మూకలు పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. సుమారు అరగంట పాటు విధ్వంసం సృష్టించారు. రౌడీ మూకల దాడిలో సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మి అనేవారు తీవ్రంగా గాయపడగా, బెల్లపు వరలక్ష్మి అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దశలో ’ఆక్వా పార్క్ నిర్మాణాన్ని ఆపేది లేదు. అడ్డొచ్చిన వారిపై కేసులు పెడతాం. జైళ్లలో తోయిస్తాం. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయకపోతే మీ అంతు చూస్తాం’ అంటూ రౌడీలు, ఎమ్మెల్యే అనుచరులు ఊగిపోయారు. దీంతో గ్రామంలోని మహిళల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. గ్రామం నలుమూలల నుంచి మహిళలు జనచైతన్య యాత్ర జరిగే ప్రాంతానికి తరలి రావడంతో ప్రతిదాడి జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం అక్కడకు చేరుకున్న మహిళలు ‘మాధవనాయుడు నశించాలి, చంద్రబాబు నాయుడు నశించాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆవిష్కరించిన శిలాఫలకాన్ని, బ్యానర్లను ధ్వంసం చేశారు. ఎంతోమంది ఉసురు పోసుకుని ఆక్వా పార్క్ నిర్మాణం చేపడుతున్నారని, ఈ పాపం ఊరేకే పోదని శాపనార్థాలు పెట్టారు. పోలీసుల్ని, రౌడీలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ఎంతకాలం పాలన సాగిస్తారో చూస్తామని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు. ఇదిలావుండగా, గాయపడిన మహిళలను 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళలపై దాడికి పాల్పడి, వారిని గాయపర్చిన రౌడీ మూకలను వదిలేసి, గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ధిక్కరిస్తున్నారేం!
జిల్లా ఎస్పీ, నరసాపురం ఎమ్మెల్యేకు జిల్లా అదనపు జడ్జి నుంచి షోకాజ్ నోటీసులు జూలై 1న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు నరసాపురం : అనుచరులతో కోర్టు ఆవరణలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అతని సోదరుడు పటేల్నాయుడు, వారి అనుచరులపై చార్జిషీట్ నమోదు చేయడంలో చోటుచేసుకున్న జాప్యంపై నరసాపురం అదనపు జిల్లా జడ్జి పి.కళ్యాణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 1న నరసాపురం ఏడీజే కోర్టుకు స్వయంగా హాజరై, వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, నరసాపురం సీఐ పి.రామచంద్రరావు, టౌన్ ఎస్సై బి.యుగంధర్కిరణ్కు ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో.. కోర్టు విలువలను గౌరవించకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతోపాటు ఆయన సోదరుడు పటేల్ నాయుడుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘2015 ఆగస్ట్ 15న ఎమ్మెల్యే అతని అనుచరులతో వచ్చి కోర్టు ఆవరణలో నాతో గొడవకు దిగారు. జాతీయ జెండాను కాళ్లకిందవేసి తొక్కారు. వందమందికి పైగా న్యాయవాదులు ప్రదర్శనగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి 22 నెలలు గడుస్తున్నా కనీసం చార్జిషీట్ వేయలేదు. జిల్లా అదనపు కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 15న ఇచ్చిన తీర్పులో ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి, గొడవకు కారణమైన ఎమ్మెల్యే మాధవనాయుడు, అతని అనుచరులపై చార్జిషీట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. 2015 ఏప్రిల్ 15న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించింది. ఈ కేసులో నాతో సహా, 20మంది సాక్షులను విచారించి కూడా, ఇప్పటివరకూ ఎందుకు చార్జిషీట్ నమోదు చేయలేదు’ అని జడ్జి కళ్యాణరావు ప్రశ్నించారు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఒక న్యాయస్థానానికి, జడ్జికి సంబంధించిన విషయంలోనూ పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజకీయ పలుకుబడితో ఈ క్రిమినల్ కేసునుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని జడ్జి మండిపడ్డారు. పోలీసుల తీరు, ఎమ్మెల్యే వ్యవహార శైలివల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగే అవకాశం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విభాగాలు రాజ్యాంగపరంగా వాటి విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైన సందర్బాల్లో న్యాయవ్యవస్థ తానంతట తాను జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కంటెంట్ ఆఫ్ కోర్టు రూల్స్ 9(4) కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు జడ్జి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల సహకారంతో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ యాక్ట్‌గా రిఫర్ చేయించేందుకు ప్రయత్నించడం దారుణమని షోకాజ్ నోటీసులో జడ్జి ఆవేదన వెలిబుచ్చారు. ఇదిలావుంటే ఈ వ్యవహారానికి సంబంధించి జడ్జి కళ్యాణరావు ఇటీవల సుప్రీంకోర్టుకు, ప్రధానమంత్రికి, హైకోర్టుకు, మానవ హక్కుల సంఘానికి లేఖలు రాసిన విషయం విదితమే. -
టీడీపి ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా!
హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడుకు హైకోర్టు బుధవారం వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. జిల్లా జడ్జితో పాటు ఇతర న్యాయాధికారుల పట్ల మాధవనాయుడు దురుసుగా వ్యవహరించారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. . అయితే మాధవనాయుడు తను చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చిదంబరం చెప్పడంతో, అందుకు అంగీకరించిన ధర్మాసనం క్షమాపణను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది. -
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టిన లాయర్లు
నరసాపురం: స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయమూర్తి, న్యాయవాదులతో దురుసుగా ప్రవర్తించిన నరసాపురం టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆయన అనుచరులపై స్థానిక పోలీసుస్టేషన్ లో బార్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. ఈ ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. -
ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి
నరసాపురం (రాయపేట) :న్యాయమూర్తిపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, అతని అనుచరులపై క్రిమినల్ కేసు పెట్టాలని నరసాపురం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు శనివారం సమావేశమై స్వాతంత్య్ర దినోత్సవం రోజున అదనపు జిల్లా న్యాయమూర్తి పి.కల్యాణరావు, న్యాయవాదులపై ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటంపై చర్చించారు. ఎమ్మెల్యే ప్రవర్తన న్యాయవ్యవస్థను అవమానించినట్లుగా ఉందని, ఇటువంటి ఘటన ఇంతవరకు దేశంలో ఏ శాసనసభ్యుని నుంచి ఎదురుకాలేదని సభ్యులు విమర్శించారు. బార్ అసోసియేషన్‌లో ఆయనకున్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని పట్టుపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మాధవనాయుడు బార్ అసోసియేషన్ సభ్యుడు కావడం తొలుత గర్వపడ్డామని, ఆయనకు ఘన సన్మానం కూడా చేయాలని యోచించామని, అయితే ఆయన నిజస్వరూపం బయటపడిందని అసోసియేషన్ మండిపడింది. ఈ ఘటనపై న్యాయమూర్తి కల్యాణరావు తీవ్ర మనస్థాపం చెందారని, దీనిపై చర్చించడానికి ఆయన విముఖత చూపుతున్నట్టు సభ్యులు తెలిపారు. సీనియర్ న్యాయవాదులతో కమిటీ ఈ ఘటనకు సంబంధించి సమగ్రంగా చర్చించి చట్టపరమైన చర్య తీసుకునేందుకు సీనియర్ న్యాయవాదులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఘటన పూర్వపరాలు పరిశీలించి తదుపరి కార్యాచరణ నిర్ణయించాలని అసోసియేషన్ తీర్మానం చేసింది. కమిటీలో జీవీకే రామారావు, వడ్డి రామానుజరావు, అందే బాపన్న, కొమాండూరి శ్రీనివాస్, కానూరి స్వామినాయుడు, పోలిశెట్టి రఘురామారావు, ఇతర సీనియర్ న్యాయవాదులు, ప్రస్తుత, పూర్వ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. 19న విధుల బహిష్కరణ ఎమ్మెల్యే మాధవనాయుడు న్యాయమూర్తిపై నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగిన ఘటనను నిరసిస్తూ ఈనెల 19న జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్లకు సమాచారం అందించామన్నారు. ఆ రోజు పట్టణంలో నల్లబ్యాడ్జీలు ధరించి, మౌన ప్రదర్శన నిర్వహించి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రాన్ని అందించాలని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు దృష్టికి.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఘటన న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తూ శాసనసభ్యుని దురుసు ప్రవర్తనను సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, ఎన్నికల కమిషన్, న్యాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు పంపినట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. -
'జడ్జిపై నరసాపురం ఎమ్మెల్యే దౌర్జన్యం'
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కోర్టు ఆవరణ వద్ద అదనపు జడ్జి కల్యాణరావుతో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆవరణలో షాపులు ఖాళీచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జడ్జిపై ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారని నరసాపురం బార్ అసోసియేషన్ ఆరోపించింది. ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించారని మండిపడింది. జడ్జిని ఏకవచనంతో సంబోధించడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది. ఎమ్మెల్యే దౌర్జన్యానికి నిరసనగా బుధవారం విధులు బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి బాబ్జి తెలిపారు. అయితే జడ్జి పట్ల తాను దురుసుగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే మాధవనాయుడు వివరణయిచ్చారు. ప్రత్యామ్నాయం చూపకుండా జడ్జి స్వయంగా షాపులు ఖాళీ చేయిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఆయన జడ్జి అని తనకు తెలియదని చెప్పారు.