బండారు మాధవ నాయుడు
హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ్యుడు బండారు మాధవ నాయుడుకు హైకోర్టు బుధవారం వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. జిల్లా జడ్జితో పాటు ఇతర న్యాయాధికారుల పట్ల మాధవనాయుడు దురుసుగా వ్యవహరించారని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఆయన చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. . అయితే మాధవనాయుడు తను చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది చిదంబరం చెప్పడంతో, అందుకు అంగీకరించిన ధర్మాసనం క్షమాపణను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించింది.