
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ ఆరోపణల వ్యవహారంలో హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ విషయమై బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. మైనింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం విషయమై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
మైనింగ్ పన్నులను ఎందుకు వసూలు చేయలేదో చెప్పాలని కోర్టు అధికారులను ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో కాగ్ ద్వారా దర్యాప్తు జరిపిస్తామని స్పష్టం చేసింది. మైనింగ్ వ్యవహారంపై శ్రీనివాసరావుకు నోటీసులు కూడా జారీ చేసింది. సీబీఐ, కాగ్, కేంద్ర మైనింగ్ శాఖలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.