ఇసుక అక్రమ తవ్వకాలను అణచివేద్దాం
Published Fri, Feb 10 2017 11:03 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు (అగ్రికల్చర్): ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్ కూడా పాల్గొన్నారు. హంద్రీలో అడ్డుగోలుగా ఇసుక తవ్వకాలు జరుపుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం, అఫిడవిట్ కూడా సరిగా ఉండలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శుక్రవారం పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెంచాలని, ఇందులో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హంద్రీ, కుందూ, తుంగభద్రలో ఎక్కడ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
అనుమతి లేని ప్రాంతాల్లో ఇసుక అడ్డుగోలుగా తవ్వడాన్ని వెంటనే నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హంద్రీ, తుంగభద్రల్లో రాత్రి పూట గస్తీ పెంచాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను చూసీచూడనట్లుగా ఉంటే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తప్పవని వివరించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ తవ్వకాలను ఉక్కు పాదంతో అణచివేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపే వారిని ఎవరిని వదలవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, గనుల శాఖ ఏడీ వెంకటరెడ్డి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement