ఇసుక అక్రమ తవ్వకాలు
ఇసుక అక్రమ తవ్వకాలు
Published Sun, Jul 9 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM
జిరాయితీ భూమి పేరుతో పనులు
కాకినాడకు చెందిన కంపెనీ ప్రాజెక్టుకు తరలింపు
అనుమతులున్నాయంటూ వాదన
పత్తాలేని అధికార గణం
నటుడు బాలకృష్ణ బంధువుల పనిగా అనుమానం
కపిలేశ్వరపురం (మండపేట) : కోరుమిల్లి గ్రామంలో ఏదో రూపంలో ఇసుక అక్రమాలు సాగుతూనే ఉన్నాయి...ర్యాంపులు నిర్వహణలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల స్వయం నిర్వహణలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ గుట్టలను అధికారులు స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ర్యాంపులు మూతపడ్డాయి. అయినా గ్రామంలో ఇసుక తరలింపు ఆగలేదు. కాకినాడకు చెందిన ఓ రెసిడెన్సీ సంస్థకు ఈ గ్రామం నుంచి శనివారం భారీ వాహనాల్లో ఇసుకను తరలించారు. ఆ సంస్థ బంధువులకు ఈ గ్రామంలో గోదావరి తీరాన జిరాయితీ భూములున్నాయి. ఆ భూముల్లో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించుకుంటున్నామన్న వంకతో భారీ స్థాయిలో ఇసుకను కాకినాడకు తరలించేస్తున్నారు. అందుకోసం ఉచిత ఇసుక విధానం కోసం వినియోగించిన ర్యాంపు బాటనే నేరుగా వినియోగిస్తున్నారు. వారి చర్యలకు దన్నుకోసం స్థానిక అధికార పార్టీ నేతలను చేరదీశారు. ఇసుక తరలింపు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ర్యాంపును సందర్శించగా పలు ఆశక్తిగల అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇసుకను తీసుకెళ్తున్న కాకినాడలోని సంస్థ, ఇసుకను తరలిస్తున్న కోరుమిల్లిలోని భూములు సీఎం చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ బంధువులకు చెందినవని తెలియ వచ్చింది. కోరుమిల్లిలోని జిరాయితీ భూముల్లో ఇసుక మేటలు వేశాయని, మేటలను తొలగించుకుని పంటల సాగు చేసుకునే వీలు కల్పిస్తూ అనుమతులు కోరుతూ గతంలో దరఖాస్తు చేశారు. ర్యాంపులు మూత పడడంతో సంస్థకు ఇసుక అత్యవసరం కావడంతో ఆ అవకాశాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. తవ్వకాలకు అనుమతి ఉన్నదీ లేనిదీ స్పష్టతలేని పరిస్థితి. అనుమతి పత్రాలు చూపాలని మీడియా ప్రతినిధులు కోరగా తమ వద్ద లేవంటూ నిర్వాహకులు సమాధానం దాటవేశారు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం ఇసుక ర్యాంపును ఆనుకుని ఉండటం, అక్కడ ఎలాంటి సాగు పంటలు లేకపోవడంతో జిరాయితీ భూములు పేరు చెప్పి ర్యాంపులో తవ్వకాలు జరుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా తమకు 16.16 ఎకరాలు జిరాయితీ భూమి ఉందని గోదావరి నదిలో కలిసిపోవడంతో తవ్వకాలు నదిలో చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇంత భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులెవరూ అటువైపు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తహసీల్దార్ కేపీ నరసింహులు, మైన్స్ అధికారులను వివరణ కోరగా కలెక్టరు అనుమతి ఇచ్చిందీ లేనిదీ తమకు తెలీదని సమాధానమిచ్చారు. గతంలో కోరుమిల్లిలో ఇసుక గుట్టలు పెట్టినప్పుడే అధికారులు వెంటనే స్పందించిన అధికారులు ఇప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రాకపోవడంతో తవ్వకాలు వెనుక అధికార పార్టీ రాష్ట్ర నాయకుల హస్తం ఉందన్న వాదన బలంగా ఉంది.
Advertisement
Advertisement