అక్రమ తవ్వకాల్లో హైడ్రామా | Illegal mining of sand | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాల్లో హైడ్రామా

Published Mon, Jul 10 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

అక్రమ తవ్వకాల్లో హైడ్రామా

అక్రమ తవ్వకాల్లో హైడ్రామా

తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు 
అనుమతి పత్రాలు లేవన్న తహసీల్దారు, నిర్వాహకులు 
వాహనాలను నిలిపివేసిన వైఎస్సార్‌ నేతలు 
తీవ్ర హైడ్రామా నడుమ పుట్టుకొచ్చిన అనుమతి పత్రాలు
అనుమతి ఒక చోట.. తవ్వకాలు మరోచోట 
ఇదో రకం దోపిడీగా అంటూ మండిపడిన నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ లీలాకృష్ణ
మండపేట / కపిలేశ్వరపురం : సామాన్యులు గోదావరిలో గంపెడు ఇసుకను తీసుకుంటే సవాలక్ష అనుమతులు కోరే అధికారులు రెండు రోజులుగా లక్షలాది రూపాయలు విలువచేసే ఇసుకను తరలించుకుపోతున్నా చేష్టలుడిగి చూశారు. అక్రమ తవ్వకాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు నిలదీసే సరికి తెల్లమోహం వేశారు. అనుమతి ఉందంటూనే తమ వద్ద ఆ పత్రాలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో హుటాహుటీన అనుమతి పత్రాలు తెప్పించారు. కాగా అనుమతి ఇచ్చిన చోట కాకుండా నదీ గర్భంలో తవ్వకాలు చేస్తుండటంతో ఇదో రకం దోపిడి అంటూ వైఎస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల లీలాకృష్ణ మండిపడ్డారు. 
     కపిలేశ్వరపురం మండలంలోని ఇసుక ర్యాంపులో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగిపోతున్న విషయం విదితమే. జిరాయితీ మాటున నదీ గర్భం నుంచి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. రూ. కోట్లాది విలువైన ఇసుక తరలిపోతున్న తీరును నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి సోమవారం అధికారులను వివరణ కోరేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. కోరుమిల్లి ర్యాంపు బాట నుంచి ఇసుక తరలిపోతుందని అనుమతులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు.  కలెక్టర్‌ నుంచి అనుమతి ఉన్నట్టు నిర్వాహకులు చెప్పారని, అయితే కాపీ తన వద్ద లేదని, మైన్స్‌ అధికారులను కలవాలని తహసీల్దారు అన్నారు. సామాన్యుడు ర్యాంపులో బస్తా ఇసుక తీసుకెళ్తేనే నేరమని అడ్డగించే రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో ఇసుకను తరలిస్తుంటే కనీస పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యంగా ఉదని లీలాకృష్ణ అన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం  ర్యాంపును సందర్శించారు. పదికి పైగా భారీ వాహనాలను తరలిపోతుండగా నిలువరించి బైఠాయించారు. నిర్వాహకులు కూడా అనుమతి పత్రం తమ వద్ద లేదని చెప్పారు. దీంతో సాయంత్రం వరకు ర్యాంపు వద్ద బైఠాయింపు కొనసాగించారు. ఎస్సై బి.రాజేష్‌కుమార్‌ కూడా అనుమతి సంగతి రెవెన్యూ వారు చూసుకుంటారని సమాధానం చెప్పారు. 
ఆగమేఘాలపై అనుమతి పత్రం 
రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్న చందాన లీలాకృష్ణ ఆందోళన కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో సాయంత్రం వేళ కాకినాడ నుంచి అనుమతి పత్రాన్ని నిర్వాహకులు తీసుకొచ్చి చూపించారు. దాన్ని చదవగా పలు ఆశక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏడో తేదీనే అనుమతి ఇచ్చినట్టు ఉంది. మరి మూడు రోజులుగా స్థానిక, మండల స్థాయి అధికారుల వద్ద కాపీలు లేకపోవడం, అదే విషయాన్ని వారు పలుమార్లు మీడియాకు చెప్పడం గమనార్హం.  
ఈ ప్రశ్నలకు బదులేది?
‘ సాంకేతిక పరిజ్ఞాణాన్ని ఎంతగానో అభివృద్ధి చేసానని చెప్పుకునే చంద్రబాబు పాలనలో జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని మండలానికి తెచ్చేందుకు మూడు రోజులు పట్టడం, కనీసం రెవెన్యూ, పోలీస్, మైన్స్‌ అధికారుల వద్ద కూడా కాపీ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 
‘ ఉచిత ఇసుకను తరలించేందుకు వినియోగించిన బాటనే నిర్వాహకులు వినియోగించడంతోపాటు. అదే ర్యాంపులో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. 
‘ జిరాయితీ భూమిలో ఇసుక మేటల తవ్వకాలకు అనుమతి ఇవ్వగా ర్యాంపును ఆనుకుని నదీ గర్భంలో యదేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం తవ్వకాలు జరుగుతున్న చోట కనీసం మొక్క, కానీ చెట్టుకానీ లేవు అది జిరాయితీ భూమి ఎలా అవుతుందని అడుగుతుంటే అధికారులు తెల్లమోహం వేస్తున్నారు.
ఇదో రకం ఇసుక దోపిడీ : లీలాకృష్ణ 
ఈ సందర్భంగా లీలాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రోద్భలంతో ఇసుక అక్రమ తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయనడానికి కోరుమిల్లి ర్యాంపులో జరుగుతున్న వ్యవహారమే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. కర్రి పాపారాయుడుతో కలిసి లీలాకృష్ణ మాట్లాడుతూ జిరాయితీ భూమిలో ఇసుకను తవ్వడానికి రెవెన్యూ శాఖాధికారుల అనుమతి తప్పనిసరని మండల రెవెన్యూ అధికారే అనుమతి ఉన్నదీ లేనిదీ చెప్పలేదంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరితెగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. రూ. కోట్లాది విలువైన ఇసుకను కాకినాడలోని అధికారపార్టీ నేతలకు చెందిన సంస్థల ప్రాజెక్టులకు ఇసుకను తరలిస్తున్నారని, రోజంతా ఉద్యమం చేస్తేనే అనుమతి కాపీని తీసుకొచ్చారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడు రోజులుగా అనుమతి పత్రం లేకుండా ఇసుకను తరలిస్తున్నా పోలీస్, రెవెన్యూ, మైన్స్‌ అధికారులు కనీసం పట్టించుకోలేదంటే అధికార పార్టీ నేతలు వ్యవస్థను ఎలా మేనేజ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. 
కార్యక్రమంలో నాయకులు మేడపాటి ప్రసాదరెడ్డి, గంగుమళ్ళ రాంబాబు, పొలమాల సత్తిబాబు, గుత్తుల శ్రీనివాస్, నేల సూర్యకుమార్, సవిలే జయంత్, పెయ్యల యాకోబు, మాతా నాగేశ్వరరావు, సర్రాకుల అబ్బులు, పీతల శ్రావన్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement