సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరా యించిన టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని ప్రతివాదులుగా చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పై సకాలంలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోలేదని, వారిరువురు విధులు నిర్వర్తించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ జి.మల్లేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ శాసనసభ కార్యదర్శి బులిటెన్ జారీ చేయడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది లేవనెత్తారు. తలసానిపై వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ మిగిలిన 12 మంది గురించి వాదిస్తే తాము ఎలా స్పందిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
దాంతో టీఆర్‌ఎస్‌లో చేరిన మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ప్రతివాదులుగా పేర్కొంటూ మరో అదనపు పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని న్యాయవాది కోరారు. గవర్నర్, స్పీకర్‌లను ప్రతివాదులుగా చేయడంతో హైకోర్టు రిజిస్ట్రీ వ్యాజ్యానికి నెంబర్ కేటాయించలేదు. ఈ అంశంపైనే ధర్మాసనం విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment