సండ్ర వెంకటవీరయ్య
సాక్షి, కొత్తగూడెం: టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా జిల్లా నుంచి కొందరు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం అవుతోందనేది జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే మొదట గులాబీ బాస్ కేసీఆర్ టీడీపీ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కారెక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల తర్వాత కాంగ్రెస్ శాసన సభ్యులకు గాలం వేసేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో భారీ మెజారిటీతో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. భద్రా ద్రి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల్లో జరుగబోయే పార్లమెంటు ఎన్నిక ల్లో గులాబీ జెండా ఎగరేయాలంటే ఖమ్మం, మ హబూబాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లలో గెలిచిన విపక్ష ఎమ్మెల్యేలను ‘కారు’లో ఎక్కించుకునేందు కు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని బహిరంగ చర్చ జరుగుతోంది. ఇప్పటికే సత్తుపల్లి ఎ మ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేర డం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొంత ఆలస్యంగానైనా మెచ్చా కూడా గులాబీ గూటికి చేరతారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే ఈ నెల 17వ తేదీలోపే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ఎవరి ఆధ్వర్యంలో చేరుతారో..
అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒకవేళ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటే ఎవరి ఆధ్వర్యంలో చేరుతారోననేది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములునాయక్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే పొంగులేటి వర్గీయులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే కారెక్కేందుకు సండ్ర సిద్ధమైనప్పటికీ.. మెచ్చా మాత్రం సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటవీరయ్యతో కలిసి వెళితే ఆయనకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని, తనకు ప్రాధాన్యం ఉండదని మెచ్చా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెచ్చాకు కూడా ప్రాధాన్యత కల్పించేలా నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న మెచ్చా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. గెలిచిన తరువాత మర్యాదపూర్వకంగానే తుమ్మలను కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు సంబంధించిన చర్చలు లేవని మెచ్చా చెబుతున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మెచ్చా గులాబీ గూటికి చేరడం ఒకవేళ ఖాయమైతే.. ఎవరి ఆధ్వర్యంలో అనే ఉత్కంఠ టీఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
మెచ్చాకు చంద్రబాబు ఖరీదైన కారు..?
మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉండడంతో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెచ్చాను పిలిపించుకుని పార్టీ మారవద్దని సూచించారు. సండ్ర టీఆర్‌ఎస్ గూటికి చేరినా మెచ్చాను మాత్రం వెళ్లవద్దని కోరినట్లు సమాచారం. టీడీపీలో కొనసాగితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబు మెచ్చాకు ఖరీదైన కారు బహుకరించినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగ చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment