మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి
⇒ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు హైకోర్టు ఆదేశం
⇒ మధ్యంతర ఉత్తర్వులు జారీ
⇒ పిటిషన్లను పరిష్కరించకుండానే టీడీఎల్‌పీ విలీనంపై బులెటినా?
⇒ ఈ కేసులో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉంటారు
⇒ ఆయన తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యం తర ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తాము దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ పరిష్కరించకుండానే.. టీఆర్‌ఎస్‌లో టీడీఎల్‌పీ విలీనమైనట్లు శాసనసభ కార్యదర్శి పేరిట జారీ అయిన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం తేలేంత వరకు బులెటిన్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలైన ఈ అనుబంధ పిటిషన్‌పై ఇంతకుముందే విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.
ఆ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడే..
శాసనసభ రోజూవారి వ్యవహారాల్లో భాగంగానే బులెటిన్ జారీ అయిందని, అంతేకాక అది సభ అంతర్గత వ్యవహారం అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదించారు. అయితే ఆ వాదనలతో విభేదిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తన ముందున్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండానే, టీడీపీఎల్‌పీ విలీనంపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారంటూ ఆక్షేపించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఈ కేసులో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని, అందువల్ల ఆయన నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు.
ఈ కేసులో స్పీకర్ చర్యలు రాజేంద్రసింగ్ రాణా అండ్ అదర్స్, కుల్దీప్ బిష్ణోయ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీసుకునే నిర్ణయాలు శాసనసభ నిర్ణయాలు కావని, కాబట్టి ఆయన నిర్ణయాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ ఉండదని కిహోటో హోల్లోహన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి తన ఉత్వర్వుల్లో ఉటంకించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఫిరాయింపులపై తన ముందున్న ఫిర్యాదులపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టంచేశారు.