స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారం | Pocharam Srinivas Reddy Elected As Assembly Speaker | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక

Published Fri, Jan 18 2019 11:29 AM | Last Updated on Fri, Jan 18 2019 4:29 PM

Pocharam Srinivas Reddy Elected As Assembly Speaker - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం సభలో అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే పోచారం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. పోచారంకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లు.. ఆయనను స్పీకర్‌ స్థానం వరకు తీసుకుని వెళ్లారు. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన వారందరికి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గురువారం స్పీకర్‌ పదవికి పోచారం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తికి ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి.
 

లక్ష్మీపుత్రుడని పిలుస్తాను..
పోచారం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు. పోచారం అనేక మెట్లు అధిగమిస్తూ ఆరు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. పలు మంత్రి పదవులు చేపట్టారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నకాలంలో వ్యవసాయం బాగా అభివృద్ది చెందింది. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రైతు బంధు పథకం ప్రారంభమైంది. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించింది. పోచారం కాలుమోపిన వేళా విశేషం బాగుంది.. కాబట్టే వ్యవసాయంలో అద్భుత ఫలితాలు వచ్చాయి. శ్రీనివాస్‌రెడ్డి తనకు పెద్ద అన్న లాంటివాడని, ఆయనను లక్ష్మీపుత్రుడని పిలుస్తాన’ని కేసీఆర్‌ తెలిపారు. 

ఊరిపేరే ఇంటి పేరుగా...
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.

కుటుంబ వివరాలు...
పూర్తి పేరు: పరిగె శ్రీనివాస్‌రెడ్డి
తల్లిదండ్రులు: పరిగె పాపవ్వ, రాజిరెడ్డి
భార్య: పుష్ప
సంతానం: ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement