
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి ఎన్నిక కోసం గురువారం నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా.. గడువు ముగిసేసమయానికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన తెలంగాణ రెండో స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీనివాస్ రెడ్డికి స్పీకర్ పదవి రావడంతో బాన్సువాడలో సంబరాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
ఉదయం పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. స్పీకర్‌గా పోచారానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. గురువారం ఉదయమే పోచారం పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలపడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం అయింది. దీనిపై చర్చించడానికి ఉదయం అసెంబ్లీలో కేసీఆర్‌తో పోచారం భేటీ అయ్యారు.
బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాస్‌రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment