స్పీకర్‌గా పోచారమే | Pocharam Srinivas Reddy Elected As Telangana Assembly Speaker | Sakshi
Sakshi News home page

స్పీకర్‌గా పోచారమే

Published Fri, Jan 18 2019 1:11 AM | Last Updated on Fri, Jan 18 2019 4:40 AM

Pocharam Srinivas Reddy Elected As Telangana Assembly Speaker - Sakshi

అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులతో కలసి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్న పోచారం. చిత్రంలో సీఎం కేసీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, అబ్రహం, అహ్మద్‌ బలాల, సుధీర్‌రెడ్డి, భట్టి, రేఖా నాయక్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పోచారం ఎన్నికపై అసెంబ్లీ సచివాలయం శుక్రవారం అధికారిక ప్రకటన చేయనుంది. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తికి ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. దీంతో గురువారం పోచారం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. పోచారం తరఫున ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం సీనియర్‌ నేత అహ్మద్‌ బలాల, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, రేఖానాయక్‌ సైతం పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.

అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యుల వద్ద నామినేషన్‌ దాఖలు ప్రక్రియ జరిగింది. శాసనసభ స్పీకర్‌గా పోచారం ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్రవారం అధికారికంగా ప్రకటించ నున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌తోపాటు మిగిలిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్‌ స్థానంలో కూర్చో బెడతారు. అనంతరం స్పీకర్‌గా పోచారం అధ్యక్షతన శాసనసభ వ్యవహారాలు కొనసాగుతాయి. శాసనసభ ముగిశాక స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభ నిర్వహణపై బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది.

ఊరిపేరే ఇంటి పేరుగా...
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో 1949 ఫిబ్రవరి 10న పరిగె శ్రీనివాస్‌రెడ్డి జన్మించారు. సొంత ఊరు పోచారం పేరే శ్రీనివాస్‌రెడ్డి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే ఆపేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1976లో పోచారం రాజకీయాల్లో ప్రవేశించారు. 1977లో దేశాయిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1994, 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో బాన్సువాడ నుంచి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వాలలో 1998లో గృహనిర్మాణ, 1999లో భూగర్భ గనులు, 2000 సంవత్సరంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 నుంచి 2018 వరకు వ్యవసాయ మంత్రిగా పని చేశారు. తాజాగా అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

కుటుంబ వివరాలు...
పూర్తి పేరు: పరిగె శ్రీనివాస్‌రెడ్డి
తల్లిదండ్రులు: పరిగె పాపవ్వ, రాజిరెడ్డి
భార్య: పుష్ప
సంతానం: ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement