మహిళలపై ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం
నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో జన చైతన్య యాత్ర నిర్వహించేందుకు మండలంలోని కె.బేతపూడి గ్రామానికి చేరుకున్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆ గ్రామస్తులంతా వ్యతిరేకిస్తుండటంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి గ్రామంలోని పురుషులందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అడుగడుగునా పోలీసు కాపలా నడుమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీసేందుకు ప్రయత్నించగా, మాధవనాయుడు అనుచరులు, వారితో వచ్చిన రౌడీ మూకలు పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. సుమారు అరగంట పాటు విధ్వంసం సృష్టించారు.
రౌడీ మూకల దాడిలో సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మి అనేవారు తీవ్రంగా గాయపడగా, బెల్లపు వరలక్ష్మి అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దశలో ’ఆక్వా పార్క్ నిర్మాణాన్ని ఆపేది లేదు. అడ్డొచ్చిన వారిపై కేసులు పెడతాం. జైళ్లలో తోయిస్తాం. ఎమ్మెల్యే చెప్పినట్టు చేయకపోతే మీ అంతు చూస్తాం’ అంటూ రౌడీలు, ఎమ్మెల్యే అనుచరులు ఊగిపోయారు. దీంతో గ్రామంలోని మహిళల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. గ్రామం నలుమూలల నుంచి మహిళలు జనచైతన్య యాత్ర జరిగే ప్రాంతానికి తరలి రావడంతో ప్రతిదాడి జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో చెప్పారు. దీంతో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, వారివెంట వచ్చిన రౌడీ మూకలు గ్రామం నుంచి వెళ్లిపోయారు.
అనంతరం అక్కడకు చేరుకున్న మహిళలు ‘మాధవనాయుడు నశించాలి, చంద్రబాబు నాయుడు నశించాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆవిష్కరించిన శిలాఫలకాన్ని, బ్యానర్లను ధ్వంసం చేశారు. ఎంతోమంది ఉసురు పోసుకుని ఆక్వా పార్క్ నిర్మాణం చేపడుతున్నారని, ఈ పాపం ఊరేకే పోదని శాపనార్థాలు పెట్టారు. పోలీసుల్ని, రౌడీలను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే ఎంతకాలం పాలన సాగిస్తారో చూస్తామని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు. ఇదిలావుండగా, గాయపడిన మహిళలను 108 వాహనంలో నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళలపై దాడికి పాల్పడి, వారిని గాయపర్చిన రౌడీ మూకలను వదిలేసి, గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.