కడపలో కొనసాగుతున్న బంద్
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిల అరెస్టుకు నిరసనగా చేపట్టిన కడప బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా స్వచ్ఛందంగా వస్త్ర వ్యాపారులు బంద్ కు మద్దతు ఇచ్చారు. మరో వైపు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా రిమ్స్ లో కొనసాగుతున్న నేతల దీక్షలకు మద్దతు పలికి బంద్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా బంద్ ప్రకటన ఇవ్వడంతో నగరంలో షాపులు తెరుచుకోలేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కాగా శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు రిమ్స్‌లో దీక్షలు కొనసాగిస్తున్నారు. వైద్యానికి వారు నిరాకరిస్తున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీక్ష విరమించాలని ఆర్డీవో వీరబ్రహ్మం, మాజీ ఎమ్మెల్సీ సుబ్బారెడ్డి కోరగా, దీక్ష కొనసాగిస్తామని నేతలు తేల్చి చెప్పారు. మరో వైపు కలెక్టరేట్ ముందు ఉన్న దీక్షాప్రాంగణంలో వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్ రెడ్డి, కడప నగర కన్వీనర్ అంజద్ బాషా, నాగిరెడ్డి తదితరులు ఆమరణ దీక్ష చేపట్టబోతున్నారు.