మహిళ హత్యకేసులో కూతురు సహా అల్లుడి అరెస్టు
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు నగరంలో ఏడాదిన్నర క్రితం సంచలనం రేకెత్తించిన విజయలక్ష్మి హత్యకు సంబంధించి ఆమె పెద్ద కుమార్తె బాంధవి (26), అల్లుడు రవిప్రసాద్‌ను సోమవారం చిత్తూరు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సూర్యమోహనరావు కథనం మేరకు... చిత్తూరులోని దుర్గానగర్ కాలనీకి చెందిన విజయలక్ష్మి, రామమూర్తి దంపతులకు నగరంలోనే పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఆస్తిలో వాటా ఇవ్వాలని పెద్ద కుమార్తె బాంధవి పలుమార్లు తల్లిదండ్రులతో గొడవలకు దిగింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసిన తరువాత ఆస్తి ఇస్తామని తల్లి చెప్పినా వినిపించుకునేది కాదు. ఈ నేపథ్యంలో తల్లి, అడ్డుగా ఉన్న ఇద్దరు కుమార్తెలను చంపేస్తే ఆస్తంతా తనకే దక్కుతుందని ఆమె భావించింది.
పథకం ప్రకారం 2013 ఆగస్టు 23న రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె, భర్త రవిప్రసాద్‌తో కలిసి మత్తుమందును చేతి రుమాలులో ఉంచుకుని విజయలక్ష్మి ముహంపై పెట్టింది. కానీ అది పనిచేయలేదు. కేకలు వేయడానికి ప్రయత్నించిన ఆమె నోరును గట్టిగా నొక్కి పట్టుకుంది. రవిప్రసాద్ కత్తి తీసుకుని విజయలక్ష్మి మెడపై పొడిచి చంపేశాడు. మృతదేహాన్ని మంచం కింద దాచేశాడు. కొద్దిసేపటి తరువాత బాంధవి చెల్లెల్లు ఇంటికి వెళ్లారు. ఒకరిని ఇంటి బయటపెట్టి మాటల్లోకి దింపింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ఆమె మరో చెల్లెలు నందినిని సైతం రవిప్రసాద్ కత్తితో పొడిచి గాయపరిచాడు. నందిని, ఇంటి బయటున్న మరో చెల్లెలు పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. నందిని చికిత్సలు పొందిన తరువాత కోలుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు.బాంధవి, ఆమె భర్త ఉపయోగిస్తున్న సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ ఆధారంగా పలు ప్రాంతాల్లో మారుపేర్లతో వీరు తిరుగుతన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం హైదరాబాద్‌లో వీరిని పట్టుకున్నారు. ఈ కేసులో బాగా పనిచేసిన ఎస్ఐ లక్ష్మణ్‌రెడ్డి, సిబ్బందిని సీఐ అభినందించారు.