ప్రీతి జింటా.. ఓ బందిపోటు దొంగ!!
ఐపీఎల్లో తన వ్యాపార భాగస్వామి నెస్ వాడియాతో న్యాయవివాదం పెట్టుకుని.. చాలాకాలం పాటు పత్రికల ప్రధాన శీర్షికలలో నిలిచిన సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. మరోసారి ముఖానికి రంగేసుకుని వెండితెర మీదకు వస్తోంది. అయితే ఈసారి ఆమె అందాన్ని ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు లేదు. ఎందుకంటే.. నీరజ్ పాఠక్ తీస్తున్న 'భయ్యాజీ' అనే ఈ సినిమాలో ప్రీతి ఓ అరివీర భయంకరమైన బందిపోటు దొంగగా నటిస్తోంది. హీరో సన్నీ డియోల్ కూడా యూపీకి చెందిన ముఠానాయకుడి పాత్రను పోషిస్తున్నాడు.
ప్రీతిజింటా ఓ గ్యాంగ్‌స్టర్ కుమార్తెగాను, సన్నీడియోల్ భార్యగాను చేస్తోందని దర్శకుడు నీరజ్ పాఠక్ చెప్పారు. ఈ సినిమాలో ప్రీతిని చూసి.. 'సోహ్ని మాహివాల్' చిత్రం రీమేక్‌లో సోహ్నికి పంజాబీ తల్లి పాత్ర ఆమే చేయాలని సన్నీ డియోల్ భావిస్తున్నాడు. ఆ సినిమాలో సన్నీ కొడుకు హీరోగా నటించబోతున్నాడు. ఈ ఫైర్ బ్రాండ్ పాత్రలో ప్రీతి అద్భుతంగా చేస్తోందని, ఇకమీదట ఆమెను కేవలం గ్లామర్ డాల్‌గానే చూడటం కుదరదని నీరజ్ అన్నారు. తమ షూటింగ్ ఇంకా 12 రోజులే మిగిలి ఉందని చెప్పారు. ఇంతకుముందు సోల్జర్, ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రాల్లో బాబీ డియోల్, సన్నీ డియోల్‌లతో ప్రీతి జింటా నటించింది. ఆ రెండు సినిమాలూ బ్రహ్మాండమైన హిట్లయ్యాయి.