పార్సిల్లో పామొచ్చింది
నగరంలోని శివానంద సర్కిలో ఉన్న బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలో పునీత్ రాజ్‌కుమార్ (పేరు మార్చాం) ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఆయన తన ఆఫీసులోనే పని చేస్తున్న ప్రియమణి (పేరు మార్చాం)తో కలిసి ఒకే ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నారు. ప్రియమణితో రాజ్‌కుమార్ మరీ సన్నిహితంగా ఉంటున్నారని ఆకాశరామన్నకు తెలిసింది.
ఆ ఆకాశరామన్న నుంచి వారం క్రితం రాజ్‌కుమార్‌కు ఓ అందమైన పార్సిల్ వచ్చింది. డబ్బాలాగా ఉన్న ఆ పార్సిల్‌ను అందుకున్న రాజ్‌కుమార్ కచ్చితంగా అది తన శ్రేయోభిలాషుల నుంచే వచ్చి ఉంటుందని, అందులో ఏవో స్వీట్లు లేదా తినుబండారాలు ఉండొచ్చని భావించారు. మధ్యాహ్నం లంచ్ సమయం వరకు ఆ పార్సిల్‌ను తెరవకుండా అలాగే భద్రంగా దాచారు. లంచ్‌కు క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు దాన్ని తన టేబుల్ ముందు పెట్టుకొని తెరిచారు. అంతే... ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీలయ్యారు. తిను బండారాల మాట దేవుడెరుగు ఆ బాక్సులో అత్యంత విషపూరితమైన ఆకుపచ్చ పాము కనిపించింది. వెంటనే దాన్ని మూసివేశారు.
రాజ్‌కుమార్ ఈ విషయాన్ని తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు ఆ పామును తీసుకెళ్లి దూరంగా చెట్లలో వదిలేశారు. అప్పుడు అందులో నుంచి ఓ లేఖ కూడా బయట పడింది. అందులో 'నీవు ప్రియమణితో అతి చనువుగా ఉంటున్నావు. అది నీకు, నాకు మంచిది కాదు. ఆమెకు దూరంగా ఉండకపోతే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అనే హెచ్చరిక ఉంది. రాజ్‌కుమార్ సరాసరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పార్సిల్ డెలివరీ చేసిన కొరియర్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా పార్సిల్ పంపిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్ నకిలీదని తేలింది. మళ్లీ రాజ్‌కుమార్‌ను పిలిపించి విచారించగా, తనకు ఎవరూ శత్రువులు లేరని, పైగా తాను ప్రియమణితో చనువుగా ఉండడం లేదని తెలిపారు. ప్రియమణిని విచారించినా వారికి ఇదే సమాధానం వచ్చింది. దాంతో పోలీసుల అనుమానం ప్రియమణి భర్త అనంతనాగ్ (పేరు మార్చాం) మీదకు మళ్లింది. ఆయన్ని విచారించగా, తనకు అసలు సదరు రాజ్‌కుమార్ గురించే తెలియదని సమాధానం వచ్చింది.
కచ్చితంగా ఇదంతా రాజ్‌కుమార్ పట్ల ఈర్ష్యతో ఆఫీసులోపలి సిబ్బందే చేసి ఉండాలని, ఆ ఆకాశరామన్న ఎవరో కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నామని బెంగళూరు సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అంత్యంత విషపూరితమైన ఆ ఆకుపచ్చ పాము కాటుకు గురికాకపోవడం రాజ్‌కుమార్ అదృష్టమని, ఈ కేసులో సంతృప్తినిచ్చే విషయం ప్రస్తుతానికి ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.