నిండా దుస్తులు కప్పుకొన్నా వదల్లేదు
అమ్మాయిలు వేసుకుంటున్న దుస్తుల వల్లే వాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వాదించేవాళ్లు ఇప్పుడేమంటారో చూడాలి. కొత్త సంవత్సరం సందర్భంగా బెంగళూరులో ఒక అమ్మాయిని ఆరుగురు దుర్మార్గులు దారుణంగా వేధించిన ఘటన ఇంకా మరువక ముందే మరో ఘటన వెలుగుచూసింది. కళ్లు తప్ప మరేమీ కనిపించకుండా నిండా దుస్తులు కప్పుకొన్న ఓ యువతిని ఓ వ్యక్తి వేధించాడు. ఆమె పెదవులు, నాలుక కొరికేశాడు. దాంతోపాటు అతడిని ప్రతిఘటించే ప్రయత్నంలో ఆమె చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడకు సమీపంలో ఉన్న ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. ఆమె తన ఇంటికి సమీపంలో ఉన్న బస్టాపు వద్దకు వెళ్తుండగా ఒక వ్యక్తి ఆమెను వెంబడించాడు. కాసేపటి తర్వాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించి, అక్కడ ఉన్న కుక్కలు మొరగడంతో సమీపంలో ఉన్న ఇళ్లవాళ్లు వస్తారని భయపడి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో ఓ మహిళను అసభ్యంగా తాకరానిచోట తాకిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కమ్మనహళ్లిలో కొత్త సంవత్సరం సందర్భంగా స్కూటర్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మరో మహిళపై దాడి చేశారు. బెంగళూరు ఎంజీరోడ్ ఘటనపై పోలీసులు విచారిస్తుండగా సీసీటీవీ ఫుటేజి పుణ్యమాని ఈ ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆరోజు పలువురు మహిళలను వేధించడం, తాకరాని చోట తాకడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం లాంటివి కనిపించాయి. బెంగళూరు నగరవ్యాప్తంగా 1500 మంది పోలీసులు పటిష్ఠమైన నిఘా ఏర్పాటుచేసినా కూడా ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం.