బంగారు లక్ష్మణ్ సతీమణి కన్నుమూత
హైదరాబాద్: బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దివంగత నేత బంగారు లక్ష్మణ్ సతీమణి, మాజీ ఎంపీ బంగారు సుశీల(69) శనివారం సాయంత్రం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె గత నెల 17న ఆసుపత్రిలో చేరారు. డయాలిసిస్ కొనసాగుతుండగానే ఆమె రాత్రి ఏడుగంటల ప్రాంతంలో మృతి చెందారు. గతంలో ఆమె రాజస్తాన్లోని జాలోర్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆమె భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని స్వగృహానికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆమె మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం వెనుకబడిన వర్గాలు, పార్టీకి తీరని లోటు అని అన్నారు.
వైఎస్ జగన్ సంతాపం
బంగారు లక్ష్మణ్ సతీమణి, మాజీ ఎంపీ బంగారు సుశీల మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుశీల కుటుంబ సభ్యులకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.