ఆ నాలుగేళ్ల బాలుడికి వింత వ్యాధి..!
ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు బయేజిద్ షిక్దర్కు అంతుచిక్కని వ్యాధి సోకింది. దీంతో పసిప్రాయంలో కురువృద్ధునిలా ముఖంపై చర్మం వేలాడుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ బాలునికి గుండె జబ్బుతోపాటు దృష్టి, వినికిడి సమస్యలున్నట్లు అతణ్ని పరీక్షించిన వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలుడికి వచ్చిన ఈ వింత వ్యాధిని ప్రొజెరియాగా అనుమానిస్తున్నారు.
అయితే బాలునికి ఇటీవలే ఈవ్యాధి సోకిందని, ఇంతకుపూర్వం చలాకీగా ఆటలాడుతుండేవాడని బాలుని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బంగ్లాలో దగ్గరి రక్త సంబంధీకుల్లో వివాహాలు అధికం. ఇలాంటివారికి కలిగే సంతానానికి జన్యుసంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఈక్రమంలో బాలునికి కూడా ఇలాంటి జన్యు సంబంధిత లోపాలు తలెత్తడంతో వ్యాధి సోకిందని వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.