బంగ్లాదేశ్ అభిమానుల అత్యుత్సాహం
► టీంఇండియాను కుక్కతో పోల్చిన వైనం
ఢాకా: చాంపియన్స్ ట్రోఫీలో భారత్- బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ పోరు జరగక ముందే బంగ్లాదేశ్ అభిమానులు సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అభిమాన జట్టుకు మద్దతుగా భారత్‌ను అవమాన పరిచే పోస్టులతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ బంగ్లా అభిమాని టీం ఇండియాను కుక్కతో పోలుస్తూ చేసిన పోస్టు ప్రతి భారత పౌరునికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఆ అభిమాని బంగ్లాదేశ్ జాతీయ పతాకంతో ఉన్న పులి, భారత పతాకం కలిగిన కుక్కను వేటాడుతున్నట్లు ఉన్న పోస్టును పెట్టాడు. పైగా సోదరులారా! ఇది మంచి పోరుకానుంది అని క్యాప్షన్ పెట్టాడు. ఇది నెట్టింట్లో వైరల్ కావడంతో సదరు అభిమానిపై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా బంగ్లా అభిమానులు భారత్‌ను అవమానించే అభ్యంతకర పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరినపుడు బంగ్లా బౌలర్ టాస్కిన్ అహ్మద్ అప్పటి భారత కెప్టెన్ ధోని తల పట్టుకున్నట్లున్న మార్ఫింగ్ ఫోటోను షేర్ చేశారు.ఇక 2015లో బంగ్లాపై భారత్ మూడు వన్డెల సిరీస్ ఓడినపుడు బంగ్లాకు చెందిన ఓ వార్తా పత్రిక టీమిండియా ఆటగాళ్లు ఉన్న ఫొటోను తీసుకుని ఫొటోషాప్ ద్వారా ఆటగాళ్ల తలపై సగం జుట్టును జట్టు సారథి ముస్తాఫిజుర్ రహ్మాన్ కత్తెరతో తొలగించినట్లు ఫొటోను ప్రచురించింది. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది.