బీమాకు మొండిచెయ్యేనా..?
ఆప్తులను కోల్పోయి ఆవేదనతో ఉన్న పాలెం బస్సు ప్రమాదబాధిత కుటుంబీకులకు ఇన్సూరెన్సు కంపెనీ కూడా మొండిచెయ్యి చూపేందుకు ఎత్తుగడలు వేస్తోంది. భారీ మొత్తంలో చెల్లింపులు ఉంటాయని లెక్కలు వేసుకున్న బీమా అధికారులు లీజు ముసుగును వినియోగించుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆందోళనకు గురవుతున్న బాధితులు దీంతో మరింత రగిలిపోతున్నారు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: పాలెం బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెల్లించే విషయంలో సంబంధిత బీమా కంపెనీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. బెంగుళూరులో నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీ 02 టీఏ 0963 నంబర్ గల వోల్వో బస్సు అక్టోబర్ 30వ తేదీన కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్న 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. బస్సు పర్మిట్ జేసీ ఉమా రెడ్డి పేరిట ఉన్నా జబ్బార్ ట్రావెల్స్‌కు లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ బస్సు కొంత కాలంగా జబ్బార్ ట్రావెల్స్ పేరిట తిరుగుతున్నా ఇన్సూరెన్స్ అధికారులు జేసీ ట్రావెల్ పేరిటనే ఇన్సూరెన్స్ చేశారు. ఊహించని విధంగా ప్రమాదంలో 45 మంది మృతి చెందడంతో భారీ ఎత్తున ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుందని భావించి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జబ్బార్ ట్రావెల్స్ పేరిట బస్సు తిరుగుతున్నా తమను మోసం చేసి ఆ బస్సుకు జేసీ ట్రావెల్ పేరిట ఇన్సూరెన్స్ చేశారని అందుకు తమకు సంబంధం లేదని తెలియజేసేందుకు ఆ కంపెనీ అధికారులు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు.
27 ఏళ్ల వయస్సున్న మహమ్మద్ అసిఫ్ నెలకు రూ. 60 వేల వేతనంతో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికై ఉద్యోగంలో చేరేందుకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ బస్సు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. సాప్ట్వేర్ ఇంజనీర్ అతి చిన్న వయస్సులోనే మృతి చెందడం వల్ల బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారంగా చెల్లించాలంటూ మహమ్మద్ అలీం అనే లాయర్ మహబూబ్‌నగర్ కోర్టులో కేసు వేశారు. ఈ రకంగా అయితే రూ. 30 నుంచి రూ. 40 కోట్లు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందని భావించి బస్సు లీజు ముసుగులో బీమా చెల్లించకుండా ఎగ్గొట్టే ఎత్తు వేస్తున్నారు. సంఘటన జరిగి రెండు నెలలు పూర్తయినా రాజకీయ నేతల ప్రమేయంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. న్యాయం కోసం బాధిత కుటుంబాలు రోడ్డుమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో జిల్లా కోర్టు సుమోటోగా విచారణకు సోమవారం స్వీకరించడంతో బాధిత కుటుంబాలు సంతోషిస్తున్నాయి.
ఇదిలా వుండగా పరిహారాన్ని అందించే అంశాన్ని కూడా పర్యవేక్షిస్తామని వెల్లడించడంతో ఇన్నాళ్లూ తప్పించుకొని తిరుగుతున్న బస్సు యజమానులకు షాక్ ఇచ్చినట్లైంది. సంఘటన జరిగిన స్థల పంచనామాతో వాటికి సంబంధించిన ఫోటోలు, మృతులు, వారి కుటుంబ సభ్యుల ఫోటోలు, ఇతర వివరాలు తెలిపే డాక్యుమెంట్లను జనవరి 13వ తేదీలోపు సమర్పించాలని మోటార్ యాక్సిడెంట్ క్లైం ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) చైర్మన్ హోదాలో జిల్లా జడ్జి టి.గంగిరెడ్డి సోమవారం వనపర్తి డీఎస్పీని ఆదేశించడంతో బాధిత కుటుంబాల్లో ఆశలు రేకెత్తాయి.