bank arrears
-
మొండి పద్దులు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. చాలా మటుకు బాకీలను దివాలా చట్టం వెలుపలే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ మొండిబాకీల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు (బ్యాడ్ బ్యాంక్) ఏర్పాటు తప్పనిసరైన అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘అత్యంత జాగ్రత్తగా రూపొందించిన, విజయవంతంగా నిర్వహిస్తున్న బ్యాడ్ బ్యాంకులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో మలేషియాకు చెందిన దానహర్త కూడా ఒకటి. మనకంటూ బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకునే క్రమంలో దానహర్త మోడల్‌ను అధ్యయనం చేయవచ్చు’ అని దువ్వూరి చెప్పారు. దివాలా చట్టం (ఐబీసీ) కోడ్ కింద కేసులు ఇప్పటికే పేరుకుపోయాయని, కొత్తగా వచ్చేవి న్యాయస్థానాలపై మరింత భారంగా మారతాయని తెలిపారు. కాబట్టి ఐబీసీ పరిధికి వెలుపలే చాలా మటుకు బాకీల పరిష్కారం చోటు చేసుకోవాల్సి రావచ్చని పేర్కొన్నారు. దివాలా చట్టంతో మొండిబాకీల సమస్య పరిష్కారం కాగలదని, బ్యాడ్ బ్యాంక్ అవసరం ఉండదని గతంలో భావించానని దువ్వూరి చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ అభిప్రాయం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు. -
అధిగమించలేనంత పెద్ద సమస్య కాదు
మొండి బాకీలపై ఆర్థిక మంత్రి జైట్లీ న్యూయార్క్: బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్య వందలు, వేల కొద్దీ ఖాతాలకు విస్తరించినది కాదని, కేవలం 20–30 పెద్ద ఖాతాలకు మాత్రమే పరిమితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ వంటి పెద్ద ఎకానమీలోని బ్యాంకింగ్ వ్యవస్థకి ఈ మొండిబాకీల సమస్యను అధిగమించడం పెద్ద సమస్య కాదన్నారు. ‘‘కాకపోతే ఎన్పీఏల సమస్య చాలా దీర్ఘకాలం కొనసాగింది. బ్యాంకింగ్ వ్యవస్థపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. సమస్యాత్మక మొండి బకాయిలకు సంబంధించి పరిష్కారానికి సహేతుకమైన కారణాలున్న పక్షంలో బ్యాంకులు కొంత మేర బాకీలు వదులుకోవాల్సి రావొచ్చన్నారు. పాతకాలం నాటి చట్టాల కారణంగా బ్యాంకులు సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని జైట్లీ తెలిపారు. మరోవైపు, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే.. 7–8 శాతం వృద్ధి రేటు భారత్‌కు సర్వసాధారణంగా మారిందని, ఇది ఇకపైనా కొనసాగగలదని ఆయన చెప్పారు.