అధిగమించలేనంత పెద్ద సమస్య కాదు
మొండి బాకీలపై ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూయార్క్: బ్యాంకుల్లో మొండి బకాయిల సమస్య వందలు, వేల కొద్దీ ఖాతాలకు విస్తరించినది కాదని, కేవలం 20–30 పెద్ద ఖాతాలకు మాత్రమే పరిమితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్ వంటి పెద్ద ఎకానమీలోని బ్యాంకింగ్ వ్యవస్థకి ఈ మొండిబాకీల సమస్యను అధిగమించడం పెద్ద సమస్య కాదన్నారు. ‘‘కాకపోతే ఎన్‌పీఏల సమస్య చాలా దీర్ఘకాలం కొనసాగింది. బ్యాంకింగ్ వ్యవస్థపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది’’ అని కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు.
సమస్యాత్మక మొండి బకాయిలకు సంబంధించి పరిష్కారానికి సహేతుకమైన కారణాలున్న పక్షంలో బ్యాంకులు కొంత మేర బాకీలు వదులుకోవాల్సి రావొచ్చన్నారు. పాతకాలం నాటి చట్టాల కారణంగా బ్యాంకులు సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని, ఈ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని జైట్లీ తెలిపారు. మరోవైపు, ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే.. 7–8 శాతం వృద్ధి రేటు భారత్‌కు సర్వసాధారణంగా మారిందని, ఇది ఇకపైనా కొనసాగగలదని ఆయన చెప్పారు.