స్వైపింగ్ కష్టాలు
సుదర్శన్ బస్సుపాస్ గడువు తీరిపోవడంతో రెన్యువల్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ లోని రైతిఫైల్ బస్టాండ్ కు వెళ్లాడు. స్వైపింగ్ సదుపాయం లేదని తెలిసి ఉసూరుమన్నారు. నోట్ల కష్టాలు మొదలయి నెల రోజుల దాటినా స్వైపింగ్ మిషన్లు ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదని అధికారులను ప్రశ్నించగా ఆర్టీసీ అధికారుల నుంచి సమాధానం రాలేదు.
డెబిట్/క్రెడిట్ కార్డులు ఆమోదించబోమని జీడిమెట్ల ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకులో బోర్డు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. డబ్బులు ఇస్తేనే చమురు పోస్తామని చెప్పారు. అదికూడా చిన్న నోట్లు ఇస్తేనే తీసుకుంటామని చెప్పడంతో వాహనదారులు బిత్తరపోయారు. సర్వర్ పనిచేయకపోవడం వల్లే కార్డులు తీసుకోవడం లేదని పెట్రోల్ బంకు నిర్వాహకులు వెల్లడించారు.
ఇలా చెప్పుకుంటే పోతే స్వైపింగ్ కష్టాలకు అంతే ఉండదు. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఏటీఎంలలోడబ్బు లేకపోవడంతో కనీసం కార్డులతోనైనా నెట్టుకొద్దామనుకున్న సగటుజీవికి స్వైపింగ్ కష్టాలు శరాఘాతంగా మారాయి. నగదు రహిత లావాదేవీలు జరపాలని ఊదరగొడుతున్న పాలకులు ఆ మేరకు సన్నాహాలు చేయడంతో విఫలమవడంతో సామాన్యుల వెతలు అంతకంతకు పెరుగుతున్నాయి. పాత పెద్ద నోట్లను రద్దు చేసి నెల రోజులు గడిచినా నోట్ల కష్టాలు తీరకపోవడం, నగదు రహిత లావాదేవీలకు సన్నాహాలు చేయకపోవడం పట్ల జనం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో పరిస్థితి ఇలావుంటే గ్రామీణులు ఇంకెంత కష్టాలు పడుతున్నారోనని ఆవేదన చెందుతున్నారు. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయోనని ఎదురు చూస్తున్నారు.