గ్యాస్ ట్రబుల్స్
సాక్షి, ఏలూరు:‘గ్యాస్ బుక్ చేశాం. సిలిండర్ తీసుకుని పది రోజులైంది. సబ్సిడీ సొమ్ము బ్యాంకులో పడలేదు. బ్యాంకుకెళ్లి అడిగితే డబ్బు రాలేదంటున్నారు. గ్యాస్ ఏజెన్సీకెళ్లి అడిగితే అధార్ కార్డు సరిగా లేదని.. బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పుగా ఫీడైందని ఏవేవో చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా ఇదే సమాధానం. ఆధార్ నంబర్‌ను బ్యాంకుకు అనుసంధానం చేస్తున్నారో కూడా తెలియడం లేదు’ జిల్లాలోని గ్యాస్ వినియోగదారుల్లో చాలామంది అంటున్న మాటలివి. గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం, నగదు బదిలీ విధానాలు వినియోగదారులకు తంటా లు తెస్తున్నాయి. గతంలో రూ.413.50 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1,324కు పెరిగింది. పూర్తి డబ్బు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే..
ఆ తరువాత సబ్సిడీ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. కొందరు వినియోగదారుల ఖాతాల్లో జమకావడం లేదు. కనీసం ఏ బ్యాంకుతో తమ ఆధార్ నంబర్ అనుసంధానమైందో కూడా తెలియక రాయితీ నష్టపోతున్నారు. జిల్లాలో 8.60 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 6 లక్షల మంది ఆధార్ కార్డు నంబర్లను గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించారు. వాటిలో 53 శాతం మాత్రమే బ్యాంకులతో అనుసంధానమయ్యాయి. మిగతా వారికి సబ్సిడీ మొత్తం అందడం లేదు. ఆధార్ నంబర్ అనుసంధానమైందో లేదో కూడా తెలియకపోవడంతో రాయితీ సొమ్ము ఎందుకు రావడంలేదో గుర్తించలేకపోతున్నారు.
అందుబాటులోకి ‘బ్యాంక్ మ్యాపింగ్’
ఈ నేపథ్యంలో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే విధంగా ‘బ్యాంక్ మ్యాపింగ్’ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ద్వారా మన ఆధార్ నంబర్ ఏ బ్యాంకుతో అనుసంధానమైందో తెలుసుకునే వెసులుబాటు లభిస్తుంది. మెబైల్ నుంచి ూ99ు డయల్ చేస్తే ఆధార్ మెనూ వస్తుంది. అందులో 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేస్తే అది ఏ బ్యాంక్‌కు అనుసంధానమైందనే వివరాలు వస్తాయి. దీనినే బ్యాంక్ మ్యాపింగ్ విధానంగా పిలుస్తున్నారు. ఆధార్ అనుసంధానం గురించి తెలుసుకుంటే రాయితీ పొం దేందుకు మార్గం సులభం అవుతుందనేది అధికారులు చెబుతున్న మాట.
రూ.700 వస్తోంది..
ఆధార్ అనుసంధాన ప్రక్రియ అంతా సవ్యంగా ఉన్నప్పటికీ కొందరు వినియోగదారులకు సబ్సిడీ సొమ్ముగా రూ.700 మాత్రమే వస్తోంది. నిజానికి తొమ్మిది సిలిండర్ల వరకూ ప్రభుత్వం దాదాపు రూ.843 సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా వెంటనే రాదు. బ్యాంకులో ఆధార్ నంబర్ నమోదు చేయించుకున్న తర్వాత ‘నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’తో అనుసంధానం కావాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత చమురు సంస్థలు బ్యాంకులకు సబ్సిడీ సొమ్మును అంది స్తాయి. చమురు సంస్థలకు ఆ మొత్తాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది. బ్యాం కులో వరుసగా మూడుసార్లు సబ్సిడీ సొమ్ము జమ కాకపోతే ఇక రానట్టే. విని యోగదారులు ఫిర్యాదు చేసి అన్ని వివరాలు సరిచేసుకున్న తర్వాతే వస్తుంది.