bank robberies
-
యూట్యూబ్ వీడియోలు చూసి.. అర్ధరాత్రి ఏంచేశాడంటే?
నరసరావుపేట (గుంటూరు జిల్లా): యూట్యూబ్‌లో వీడియోలు చూసి బ్యాంకు దొంగతనాలు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సి.విజయభాస్కరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన రాజేష్‌కుమార్ ఐటీఐ చదివాడు. ఏ పనీ చేయకుండా సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో బ్యాంకు చోరీల వీడియోలు చూసి మార్చి 30వ తేదీ అర్ధరాత్రి ఫిరంగిపురంలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు. తొలుత బ్యాంకులో అలారం వైర్లు కట్ చేసిన రాజేష్‌కుమార్ కిటికీ ఊచలు కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. స్ట్రాంగ్‌రూమ్ తాళాలు కట్టర్ ద్వారా కట్‌చేసి సేఫ్ లాకర్ తెరిచేందుకు యత్నించాడు. ఆ లాకర్ బ్యాంక్ మేనేజర్ ఫోన్‌కు అనుసంధానమై ఉండడంతో ఆ మొబైల్ అలారమ్ మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన మేనేజర్ సిబ్బందిని బ్యాంకు వద్దకు పంపారు. దీనిని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసు శాఖ రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట టుటౌన్ ఏఎస్ఐ జీవీ సుబ్బారావు, నరసరావుపేట రూరల్ ఏఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఫిరంగిపురం, నాదెండ్ల ఏఎస్ఐలు కె.శ్రీనివాసరావు, రోసిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీధర్, నాదెండ్ల హోంగార్డు కె.మధుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని గ్రిల్స్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో గుంటూరు గాంధీపార్కుకు ఎదురుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులోనూ రాజేష్‌కుమార్ రూ.23 లక్షలు చోరీ చేయగా, లాలాపేట పోలీసులు అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చిన రాజేష్‌కుమార్ మళ్లీ ఫిరంగిపురం ఎస్బీఐలో చోరీకి యత్నించాడు. దర్యాప్తు చేసిన సిబ్బందిని రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించి రివార్డుకు సిఫార్సు చేశారని డీఎస్పీ చెప్పారు. -
నోట్ల రద్దు అనంతరం పెరిగిన ఉగ్ర చేరికలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు సంచలనం సృష్టిచింది. అవినీతి, నల్లధనంపై చేపట్టిన యుద్ధమని ప్రధాని ప్రకటించారు. కానీ నోట్ల రద్దు భారత్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కాశ్మీర్‌లోని యువతను ఉగ్రమార్గంవైపు మళ్లిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని యువత నగదు, ఆయుధాలకోసం మిలిటెంట్లు గా మారుతున్నారు. బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతన్నారు. ఇటీవలి జరిగిన దోపిడిల్లో పాల్గొంది సుమారు 80శాతం మంది స్థానిక మిలిటెంట్లే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం నోట్ల రద్దు అనంతరం 13బ్యాంకు దొంగతనాలు, మరో తొమ్మిది ప్రయత్నాలు జరిగాయి.ఇందులో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌కు సంబంధిన బ్యాంకులు. 2016 నవంబర్ ఎనిమిది నుంచి 2017 మే 3వరకూ సుమారు 91లక్షల డబ్బును పలు బ్యాంకలనుంచి దోచుకెళ్లారు. ఇందులో ఏడు సార్లు జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ శాఖల్లో దోచకెళ్లారు. అలాగే పుల్వామా లోని ఇలాఖి దెహాత్ బ్యాంకు నుంచి ఒకసారి, ఎస్బీఐ నుంచి మరోసారి దోచుకుపోయారు. డబ్బు ఎలా వస్తుంది? ఇంటలిజెన్స్ సమాచారం ప్రకారం నగదు దోపిడి, ఆయుధాల చోరీలు ఇటీవల చాలా పెరిగాయని సమాచారం. సుమారు 200మంది ఇలాంటి దొంగతనాల గ్రూపుల్లో చేరారు. నవంబర్ ఎనిమిదికి ముందు ఇలాంటి ఘటనలు చాలా తక్కువ అని, వీరిని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని ఓ అధికారి తెలిపారు. పాకిస్తాన్ సైబర్ నేరస్తులు 'మాల్ ఈ ఘనిమత్' పేరుతో నిధులు సేకరించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యల్లో స్థానికులను చేర్చుకొని శిక్షణ ఇవ్వడం పాకిస్తాన్, దాని ఉగ్రవాద సంస్థల పని. ఉగ్రవాదలకు వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం స్థానికులు చందాల రూపంలో, మనీ లాండరింగ్ రూపంలో, ఏర్పాటు వాదులనుంచి వస్తున్నవే. ఇందులో ఎక్కువ భాగం ఆయుధాల కొనుగోలు, ఉగ్రవాద శిక్షణకు, సైబర్ నేరాలకు ఉపయోగిస్తున్నారు. అడ్డుకున్న భారత బలగాలు ఇటీవల జమ్మూ కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులకు ఆయుధాలు, డబ్బు సరఫరాను భారత బలగాలు భారీ మెత్తంలో అడ్డుకున్నాయి. దీంతో స్థానిక మిలిటెంట్లకు నగదు కొరత ఏర్పడింది. అంతేకాకుండా ఉగ్రవాదులకు నిధులు సాయం చేస్తున్న నాసిర్ షఫి బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేశారు. వీటన్నింటి అరికట్టడానికి ప్రస్తుతం బ్యాంకులు అనవసరంగా జరిగే నగదు లావదేవీలపై పరిమితి విధించాయి., జమ్మూ కాశ్మీర్‌పోలీసులు బ్యాంకు దోపిడీ దారులను గుర్తించే పనిలో ఉన్నారు. -
‘మనసా... వినవా’ దొంగను చేసింది
సాక్షి, హైదరాబాద్: ‘మనసా... వినవా’ అంటూ తెలుగు సినిమాను తెరకెక్కించి తన నిర్మాత కలను నిజం చేసుకోవడంతో పాటు మేనల్లుడిని హీరోగా పరిచయం చేయాలనుకున్న తమిళనాడు తిరువరూర్‌కు చెందిన బాలమురుగన్ ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. బ్యాంక్ దోపిడీలు చేస్తూనే... సినీ రంగంలో స్థిరపడాలనుకున్న మురుగన్ విలాసవంతమైన జీవితంతో ప్రాణాంతక వ్యాధి బారిన పడి రోజులు లెక్కిస్తున్నాడు. ‘ఆత్మ’ కథతో అదరగొట్టాలని అనుకున్నా... తన చోరీల గురించి పోలీసులకు తెలిసిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు మూడు నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పీటీ వారంట్‌పై మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బాలమురుగన్‌పై 29 నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. సినిమా కోసం అడ్డదారి... సినీ కెరీర్లో స్థిరపడాలని 2008లోనే బాలమురుగన్, సురేశ్ కలసి దినకరన్‌తో రాత్రివేళలో బెంగళూరు, మడివాల, కరమంగళ, జ్ఞానభారతి ప్రాంతాల్లో ఇళ్ల దొంగతనాలు, దోపిడీలు చేశారు. 2011లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది పాటు జైల్లోనే ఉన్న బాలమురుగన్ 2012లో విడుదలైన తర్వాత మకాం హైదరాబాద్‌కు మార్చాడు. దోచుకున్న సొత్తుతో హిమాయత్‌సాగర్‌లోని కిస్మత్పుర్లో ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ వారికి దగ్గరయ్యేందుకు ఈవెంట్స్ చేశాడు. కొందరు ప్రముఖుల వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఎన్.రాజమల్ల ఫిల్మ్స్ బ్యానర్ పేరుతో సౌత్ ఇండియా ఫిల్మ్ గిల్డ్ సభ్యత్వాన్ని తీసుకున్నాడు. తన సినీ కలను నెరవేర్చుకునేందుకు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులో బ్యాంక్ దోపిడీలు, ఇళ్ల దొంగతనాలు చేశాడు. 2012 సంవత్సరంలో 50 లక్షల వ్యయంతో మనసా వినవా అనే సినిమా తీశాడు. అది ఇప్పటికీ విడుదల కాలేదు. రాజమండ్రిలో ఈ సినిమా ప్రారంభానికి పోలీసులు, రెవెన్యూ అధికారులతోనే క్లాప్ కొట్టించాడు. గుడువచేరికి చెందిన రైటర్ సంపత్తో కలసి ఆత్మ సినిమా తీయాలనుకున్నాడు. ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు వెతుకుతున్నారన్న సమాచారం మేరకు బాలమురుగన్ పారిపోయాడు. ఫింగర్ ప్రింట్సే పట్టిచ్చాయి... ఇంటర్నెట్లో గూగుల్ సహకారంతో రూరల్, సబ్అర్బన్ ప్రాంతాల్లోని గ్రామీణ బ్యాంక్‌ల గురించి శోధన చేస్తాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న బ్యాంక్‌లనే టార్గెట్ చేసుకొని దోపిడీ చేస్తాడు. దినకరన్, అల్లుడు సురేశ్‌తో పాటు భార్య, కుమారుడు, కుమార్తెను కూడా తీసుకెళతాడు. గ్రేట్ డెన్ కుక్క కూడా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యామిలీతో చోరీకి వెళతాడు. పిల్లలిద్దరూ దత్తత తీసుకున్నవారే. బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో సురేశ్, బాలమురుగన్ కుటుంబసభ్యులతో వేచి చూస్తుంటే బాలమురుగన్, దినకరన్ బ్యాంక్‌లోకి వెళ్లి దోపిడీ చేస్తారు. ఆ తర్వాత తమిళనాడుకు పరారవుతారు. గతేడాది ఆగస్టులో మహబూబ్‌నగర్‌లోని గ్రామీణ బ్యాంక్‌లో రూ.40 లక్షల సొత్తు, నవంబర్ 16న చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో రూ.55 లక్షల సొత్తును, డిసెంబర్ 8వ తేదీ రాత్రి ఘట్కేసర్లోని డెక్కన్ గ్రామీణ బ్యాంక్‌లో రూ.36 లక్షల సొత్తు చోరీ చేశారు. అయితే ఈ ఏడాది జనవరి 10న ఇబ్రహీంపట్నంలోని హెచ్‌డీసీసీ బ్యాంక్‌లో దోపిడీ చేస్తుండగా బ్లూకోర్డ్స్ రాకను గమనించి పరారయ్యారు. అక్కడే వెల్డింగ్ గ్యాస్, ఇన్నోవా కారును వదిలివెళ్లారు. అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ బెంగళూరులో ఓ కేసులో నిందితుడిగా ఉన్న బాలమురుగన్ చేతివేళ్లకు మ్యాచ్ అయ్యాయి. అలా బాలమురుగన్‌కు ఈ బ్యాంక్ దోపిడీ కేసుల్లో నిందితుడిగా గుర్తించగలిగారు. గత మార్చిలో తమిళనాడులోని తిరవరూర్లో మురుగన్ ఇంటిపై దాడులు చేయగా పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఈ సమయంలో అతనికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రులకు సమాచారం అందించాలని కోరారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 3 నెలల క్రితం బెంగళూరు పోలీసులకు చిక్కడంతో సైబరాబాద్ పోలీసులు పిటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్: వరుస బ్యాంక్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల ముఠాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, తమిళనాడుకు చెందిన మురుగున్ ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి రూ.1.7 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఘట్ కేసర్ గ్రామీణ బ్యాంకుల్లో ఈ ముఠా చోరీకి పాల్పడిందన్నారు. వరదయ్యపాలెం, ఇబ్రహీంపట్నం బ్యాంకుల్లో కూడా నిందితులు చోరీకి పాల్పడి ఉండొచ్చునని వారు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయినట్లు వివరించారు. నిందితులను విచారణ చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
దొంగలకు బంగారు బాతులుగా బ్యాంకులు